బిడ్డ కావాలి.. నా భర్తకు పెరోల్‌ ఇవ్వండి: ఓ మహిళ అభ్యర్థన

సంతానం కోసం జైలు శిక్ష అనుభవిస్తున్న తన భర్తను విడుదల చేయాలని ఓ మహిళ జైలు అధికారులను ఆశ్రయించిన ఘటన మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో చోటుచేసుకుంది.

Published : 17 May 2023 18:17 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని గ్వాలియర్‌ సెంట్రల్‌ జైలు అధికారులకు ఓ మహిళ అరుదైన అభ్యర్థన చేసింది. తనకు సంతానం కావాలని.. అందుకోసం జైల్లో ఉన్న తన భర్తను పెరోల్‌ (Parole)పై విడుదల చేయాలని ఆ మహిళ దరఖాస్తు చేసుకుంది.

గ్వాలియర్‌లోని శివ్‌పురి ప్రాంతానికి చెందిన దారా సింగ్‌ జాతవ్‌ అనే వ్యక్తికి ఏడేళ్ల క్రితం ఓ మహిళతో వివాహమైంది. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే ఓ హత్య కేసులో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆ కేసులో అతడు దోషిగా తేలడంతో జీవితఖైదు విధించారు. అప్పటి నుంచి గ్వాలియర్‌ సెంట్రల్‌ జైలు (Gwalior Central Jail )లో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, ఇటీవల దారా భార్య, కుటుంబసభ్యులు జైలు అధికారులకు ఓ దరఖాస్తు చేసుకున్నారు. తనకు పిల్లలు కావాలని, అందువల్ల తన భర్తను పెరోల్‌ (Parole)పై విడుదల చేయాలని దారా భార్య అభ్యర్థించింది.

దీనిపై సెంట్రల్‌ జైలు సూపరిండెంట్‌ మాట్లాడుతూ.. ఆ మహిళ దరఖాస్తును శివ్‌పురి ఎస్పీకి పంపించినట్లు తెలిపారు. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) జైలు నిబంధనల ప్రకారం.. జీవితఖైదు పడిన దోషి రెండేళ్ల శిక్షాకాలం పూర్తి చేసుకున్న తర్వాత అతడి సత్ప్రవర్తన ఆధారంగా పెరోల్‌ పొందే అవకాశముందని జైలు అధికారులు తెలిపారు. అయితే దీనిపై జిల్లా కలెక్టర్‌ తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

కాగా.. గతంలోనూ ఓ రాజస్థాన్‌ మహిళ ఇలాంటి అభ్యర్థనతోనే కోర్టును ఆశ్రయించగా.. అక్కడి హైకోర్టు అరుదైన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. సంతానం పొందేందుకు తనకున్న హక్కును వినియోగించుకునేందుకు జైల్లో ఉన్న తన భర్తను విడుదల చేయాలని ఓ మహిళ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై అప్పట్లో విచారణ జరిపిన జోధ్‌పుర్‌ ధర్మాసనం.. ఆ ఖైదీకి 15 రోజుల పెరోల్‌ మంజూరు చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు