Akasa: విమానంలో ప్రయాణికురాలి వింత ప్రవర్తన.. సిబ్బంది చేయి కొరికి..

ఆకాశ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ఓ ప్రయాణికురాలు వింతగా ప్రవర్తించింది. సిబ్బంది చేయి కొరికి తీవ్రంగా గాయపరిచింది. 

Published : 18 Jun 2024 19:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్: విమానంలో కొందరి ప్రవర్తన తోటి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. అత్యవసర ద్వారాన్ని తెరవడం, బాంబు ఉందంటూ కొందరు బెదిరింపులకు పాల్పడడం తరచూ వింటూనే ఉన్నాం. తాజాగా ఓ ప్రయాణికురాలు సిబ్బందిని తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన ఆకాశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో (Akasa Air flight) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

లఖ్‌నవూ నుంచి ముంబయికి వెళ్లాల్సిన విమానం టేకాఫ్‌కు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఓ ప్రయాణికురాలు వింతగా ప్రవర్తించింది. తోటి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలిగించింది. ఫిర్యాదు చేయడంతో సిబ్బంది మహిళను కిందకు దించేశారు. మళ్లీ లోపలికి వచ్చేందుకు యత్నిస్తుండగా అడ్డుకున్నందుకు సిబ్బందిలో ఒకరి చేతిని బలంగా కొరికింది. అనంతరం పోలీసులకు ఆమెను అప్పగించారు. ఆ మహిళ మానసిక పరిస్థితి సరిగా లేదని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రయాణికుడిని కాపాడిన ఆర్మీ మ్యాన్‌..

మరోవైపు.. గోవా నుంచి చండీగఢ్‌కు బయలుదేరిన విమానంలో ఆర్మీకి చెందిన వైద్యుడు ఒకరు మానవత్వాన్ని చాటుకున్నారు. విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. అప్పుడు విమానం 40 వేల అడుగుల ఎత్తులో ఉంది. దీంతో బాధితుడిని కాపాడేందుకు మేజర్‌ సిమ్రత్‌ రాజ్‌దీప్‌ ముందుకొచ్చారు. అందుబాటులో ఉన్న మెడికల్‌ కిట్‌ సాయంతో అతడి ప్రాణాలు కాపాడారు. చాలా కాలంగా అతడు శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

ప్రయాణికుడి ఆహారంలో ‘బ్లేడ్‌’ నిజమే.. అంగీకరించిన ఎయిర్‌ ఇండియా

బాధితుడికి మెరుగైన వైద్యం అందించడానికి అత్యవసర ల్యాండింగ్‌ చేయాలంటూ రాజ్‌దీప్‌ సిబ్బందిని కోరారు. దీంతో అప్రమత్తమైన పైలట్.. ఎయిర్‌ ట్రాఫిక్స్‌ కంట్రోల్‌కు సమాచారం అందించి ముంబయి ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని