భర్త కోసం అన్వేషణ.. చంటిబిడ్డతో దట్టమైన అడవిలోకి వెళ్లిన భార్య..!

తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు ఉగ్రవాదులు దేశ భద్రతా విభాగానికి చెందిన అధికారిని అపహరిస్తారు. వారి చెరలో ఉన్న భర్తను విడిపించుకునేందుకు ఆయన భార్య పెద్ద పోరాటమే చేసింది.

Published : 16 Feb 2022 18:25 IST

ఈ ఛత్తీస్‌గఢ్‌ ఘటన ఎక్కడకు చేరిందంటే..?

రాయ్‌పూర్: తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు ఉగ్రవాదులు దేశ భద్రతా విభాగానికి చెందిన అధికారిని అపహరిస్తారు. వారి చెరలో ఉన్న భర్తను విడిపించుకునేందుకు ఆయన భార్య పెద్ద పోరాటమే చేసింది. తనకు పరిచయం లేని, భాష తెలియని ప్రాంతంలో ఆమె చేసిన ప్రయాణమే మణిరత్నం దర్శకత్వం వహించిన రోజా సినిమా. ఆ సినిమాలోని భావోద్వేగాలు ప్రేక్షకుడి హృదయాలను హత్తుకున్నాయి. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే.. వాస్తవంలో రోజా సినిమా తరహా ఘటనే జరిగింది. అయితే ఇక్కడుంది ఉగ్రవాదులు కాదు.. మావోయిస్టులు. వారు అపహరించింది ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసే ఇంజనీర్‌ను. తన భర్తను క్షేమంగా తెచ్చుకునేందుకు ఆ ఇంజనీర్ భార్య పసికందుతో దట్టమైన అడవిలోకి వెళ్లింది..!  

స్థానిక రిపోర్టర్ ఒకరు జాతీయ వార్త సంస్థకు వెల్లడించి వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని బెద్రె-నుగుర్ సమీపంలోని ఇంద్రావతి నదిలో ఓ ప్రైవేటు సంస్థ వంతెన నిర్మిస్తోంది. ఆ వంతెన నిర్మాణంపై ఆగ్రహంగా ఉన్న మావోయిస్టులు.. అక్కడ పనిచేస్తోన్న ఇంజనీర్ అశోక్ పవార్‌, మరో సిబ్బంది ఆనంద్ యాదవ్‌ను నాలుగు రోజుల క్రితం అపహరించారు. ఈ విషయం తెలుసుకున్న అశోక్ పవార్ భార్య సోనాలీ పవార్‌ హతాశులయ్యారు. తన ఇద్దరు కుమార్తెల కోసం తన భర్తను విడుదల చేయాలని ఓ వీడియో సందేశంలో వేడుకున్నారు. అక్కడితో ఆగకుండా తన భర్తను వెతుక్కుంటూ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా తన ఐదేళ్ల కుమార్తెను కుటుంబ సభ్యుల చెంత ఉంచి, రెండున్నరేళ్ల చిన్నారితో అడవిలోకి పయనమయ్యారు. ఈ క్రమంలో స్థానిక పాత్రికేయుల సహాయంతో కొందరు స్థానికుల్ని సంప్రదించారు. వారి సహకారంతో దట్టమైన అడవిలోకి ప్రవేశించి, తన ప్రయాణాన్ని కొనసాగించారు. మరోపక్క పోలీసులు తీవ్ర గాలింపు మొదలుపెట్టారు. అయితే అప్పటికే మనసు మార్చుకున్న మావోయిస్టులు అపహరించిన ఇద్దరిని కొన్ని షరతులతో మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ప్రస్తుతం వారు బీజాపూర్ పోలీసు స్టేషన్‌లో ఉన్నారని  ఏఎస్‌పీ పంకజ్ శుక్లా వెల్లడించారు.

ఇంకా ఆ అడవిలోనే ఉన్న సోనాలి.. ఈ విషయం తెలుసుకున్న వెంటనే తిరిగి ప్రయాణమయ్యారు. బీజాపూర్ స్టేషన్‌లో తన భర్తను కలుసుకోనున్నారు. కాగా, పవార్, యాదవ్‌ గమ్యస్థానాలకు చేరుకునేందుకు మావోయిస్టులు తలో రూ.2 వేలు ఇచ్చారట. ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం పవార్ షాక్‌లో ఉన్నారని, ఆయన్ను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారని తెలుస్తోంది. ఈ పవార్‌ కుటుంబం స్వరాష్ట్రం మధ్యప్రదేశ్‌. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని