Crime News: నిను వీడని నీడను నేనే: భర్తను చంపేందుకు ప్లాన్‌-ఏ, బీ అమలు..!

భర్తను వదిలించకోవాలనుకున్న ఓ భార్య హత్యకు కుట్ర పన్నింది. కానీ, అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. రెండు నెలలు ఓపిక పట్టిన ఆమె మరోసారి కిరాయి హంతకుడితో దాడి చేయించి ప్రాణాలు తీసింది. 

Published : 19 Jun 2024 16:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆమె ఓ పరాయి మగాడి మోజులో పడింది.. ఆ బంధానికి అడ్డంగా మారాడని భర్తను చంపాలనుకొంది. ఓ సారి ప్లాన్-ఏ అమలు చేసింది.. కానీ, భర్త ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక లాభం లేదని ప్లాన్‌-బీ అమలు చేసి హత్య చేయించింది. చివరికి అనుమానాస్పద ప్రవర్తనే ఆమె నేరాన్ని పోలీసులకు పట్టించింది. 

హరియాణలో వినోద్‌ బరార ఓ కంప్యూటర్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహిస్తుండేవాడు. అతడికి నిధి అనే మహిళతో పెళ్లైంది. ఆ దంపతులకు ఓ పాప కూడా ఉంది. వారు పానిపత్‌లో నివాసం ఉంటున్నారు. నిధి కొన్నేళ్ల క్రితం సుమిత్‌ అనే జిమ్‌ ట్రెయినర్‌తో ప్రేమలో పడింది. ఈ విషయం వినోద్‌ దృష్టికి రావడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో వినోద్‌ను ఎలాగైనా అడ్డుతొలగించుకొని సుమిత్‌తో జీవించాలని నిధి నిర్ణయించుకొంది. పంజాబ్‌కు చెందిన దేవ్‌ సునార్‌ అనే లారీ డ్రైవర్‌కు రూ. 10 లక్షలు చెల్లించి.. తన భర్తను వాహనంతో ఢీకొట్టి చంపాలని సూచించింది. 2021 అక్టోబర్‌ 5న వినోద్‌ను ఇంటి సమీపంలోనే దేవ్‌ లారీతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కానీ, ప్రాణాలు దక్కాయి. దీంతో నిధి భర్తను ఎలాగైన సరే అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకొంది. మరోసారి దేవ్‌ను కలిసి ప్లాన్‌-బీ కింద కాల్చి చంపాలని సూచించింది. 

రెండు నెలల తర్వాత దేవ్‌ రంగంలోకి దిగాడు. నిధి ఇంటికి వెళ్లి మంచానపడి ఉన్న వినోద్‌ను పాయింట్‌ బ్లాంక్‌ రేంజిలో కాల్చి చంపాడు. పోలీసులు దేవ్‌ను హంతకుడిగా గుర్తించి అరెస్టు చేశారు. తనపై రోడ్డు ప్రమాదం కేసు ఉపసంహరించుకొనేందుకు వినోద్‌ తిరస్కరించడంతోనే ఈ హత్య చేసినట్లు వాంగ్మూలం ఇచ్చాడు. ఈ ఘటన తర్వాత దేవ్‌ కుటుంబ అవసరాలను నిధి, జిమ్‌ ట్రైనర్‌ సుమిత్‌లే చూసుకొంటున్నారు. ఈ కేసు ఖర్చులు కూడా వారే భరిస్తున్నారు. మరోవైపు నిధి తన కుమార్తెను ఆస్ట్రేలియాలోని అంకుల్‌ వద్దకు పంపించేసింది. ఆమె విలాసవంతమైన జీవనశైలి వినోద్‌ కుటుంబీకుల్లో అనుమానాలను పెంచింది. దీంతో అతడి సోదరుడు ప్రమోద్‌ మూడేళ్ల తర్వాత ఎస్పీ అజీత్‌ సింగ్‌కు విషయం చెప్పాడు. తన సోదరుడి భార్యపై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసుల ప్రత్యేక బృందం నిందితుడు దేవ్‌ కాల్‌ డేటాను వెలికి తీసింది. తరచూ జిమ్‌ ట్రెయినర్‌ సుమిత్‌తో మాట్లాడుతున్నట్లు దానిలో గుర్తించారు. దీంతో పోలీసులు అతడి కాల్‌ డేటాను వెలికి తీయగా నిధితో సంబంధం బయటపడింది. దీంతో సుమిత్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు కుట్ర వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.   
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని