Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటనలో ‘చావు’ తెలివి.. భార్యపై భర్త ఫిర్యాదు

Odisha Train Tragedy: చావు తెలివి ప్రదర్శించిన ఓ మహిళపై ఆమె భర్త తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Published : 07 Jun 2023 17:14 IST

బాలేశ్వర్‌: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదంలో తన భర్త చనిపోయాడని చెప్పి పరిహారం పొందేందుకు ఓ మహిళ అతి తెలివి ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం ఇప్పటికే తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో ఆమె భర్తే మహిళపై ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమెను అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆ మహిళ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

కటక్‌కు చెందిన గీతాంజలి దత్తా అనే మహిళ.. ఒడిశా రైలు దుర్ఘటనలో చనిపోయిన వ్యక్తుల ఫొటోలు ఉంచిన ప్రదేశానికి వచ్చింది. ప్రమాదం జరిగిన రోజు తన భర్త రైల్లో ప్రయాణించాడని తెలిపింది. అక్కడున్న ఫొటోలను చూసుకోవాలని పోలీసులు సూచించడంతో.. ఓ వ్యక్తి ఫొటో చూపిస్తూ అతడే తన భర్త అని గీతాంజలి చెప్పింది. అయితే, ఆమె ప్రవర్తనపై అనుమానం కలిగిన పోలీసులు, ఆమె చెప్పింది తప్పు అని విచారణలో తేల్చారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అందించే పరిహారం కోసం ఇలా వ్యవహరించినట్లు అంగీకరించడంతో పోలీసులు హెచ్చరించి విడిచిపెట్టారు. అయితే, ఆ దంపతులిద్దరూ 13ఏళ్లుగా వేర్వేరుగా ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారం ఇక్కడితో ఆగిపోలేదు.

గీతాంజలి తీరు ఆమె భర్త బిజయ్ దత్తాకు ఆగ్రహాన్ని తెప్పించింది. దాంతో ఆమెపై మానియాబందా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తాను చనిపోయానని చెప్పి, పరిహారం పేరుతో ప్రజాధనాన్ని సొంతం చేసుకోవాలని చూసిన ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాడు. అయితే, రైలు ఘటన బహానగాలో జరిగినందున.. అక్కడి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించినట్లు మానియాబందా పోలీస్‌ స్టేషన్‌ ఇంఛార్జ్‌ బసంత్‌ కుమార్‌ వెల్లడించారు. ఇదే సమయంలో తనను అరెస్టు చేస్తారనే భయంతో ఆ మహిళ కనిపించకుండా పోయిందని పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఇలా మృతదేహాలు తమవేనంటూ మోసపూరిత చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైల్వేశాఖ, ఒడిశా పోలీసులకు ఆ రాష్ట్ర ముఖ్యకార్యదర్శి పీకే జెనా ఆదేశాలిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని