Video: మెట్రోస్టేషన్‌ పైనుంచి దూకిన యువతి.. ఎలా కాపాడారో చూడండి..

దేశ రాజధాని నగరం దిల్లీలో అక్షరధామ్‌ మెట్రో స్టేషన్‌ గోడపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఓ యువతిని సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది ప్రాణాలతో కాపాడారు......

Published : 15 Apr 2022 01:33 IST

దిల్లీ: దేశ రాజధాని నగరం దిల్లీలో అక్షరధామ్‌ మెట్రో స్టేషన్‌ గోడపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఓ యువతిని CISF సిబ్బంది ప్రాణాలతో కాపాడారు. ఈ ఉదయం 7.30గంటల సమయంలో స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నంబర్‌ 2 అంచుకు వెళ్లి నిలబడిన యువతిని కొందరు ప్రయాణికులు గమనించి సమాచారం ఇవ్వగా.. అప్రమత్తమైన CISF సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొన్నారు. ఆత్మహత్య చేసుకోవద్దంటూ ఎంతగానో నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఆమె పట్టించుకోకుండా ఒక్కసారిగా కిందకు దూకేసింది. దీంతో స్థానికుల సాయంతో ముందు జాగ్రత్తగా ఏర్పాటు చేసిన బ్లాంకెట్‌తో ఆమెను పట్టుకున్నారు. దీంతో ఆ యువతికి ప్రాణాపాయం తప్పింది.

దాదాపు 40 అడుగుల ఎత్తు నుంచి దూకడంతో యువతికి గాయాలయ్యాయి. వెంటనే ఆమెను స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించినట్లు CISF అధికార ప్రతినిధి వెల్లడించారు. ఆత్మహత్యకు ప్రయత్నించిన యువతిని పంజాబ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆమె వయసు 20 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండొచ్చని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను CISF అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ‘‘సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది సత్వర, తెలివైన స్పందన ఓ యువతి ప్రాణాల్ని కాపాడింది’’ అని ప్రశంసించింది. సకాలంలో స్పందించి యువతి ప్రాణాల్ని కాపాడిన జవాన్లకు సెల్యూట్‌ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని