Germany To India: అమ్మానాన్నల్ని చూసేందుకు.. బైక్‌పై జర్మనీ నుంచి భారత్‌కు

జర్మనీ నుంచి భారత్‌కు రావాలంటే సాధారణంగా ఎవరైనా విమానంలో వస్తారు! ముంబయికి చెందిన మేధా రాయ్‌ అనే యువతి మాత్రం అందుకు భిన్నం!

Updated : 10 Dec 2022 09:59 IST

156 రోజుల్లో 24 వేల కిలోమీటర్లు ప్రయాణించిన యువతి

ముంబయి: జర్మనీ నుంచి భారత్‌కు రావాలంటే సాధారణంగా ఎవరైనా విమానంలో వస్తారు! ముంబయికి చెందిన మేధా రాయ్‌ అనే యువతి మాత్రం అందుకు భిన్నం! ఆమె తన భర్తతో కలిసి.. బైక్‌పై 156 రోజుల్లో ఏకంగా 24 వేల కిలోమీటర్లు ప్రయాణించి ముంబయికి చేరుకుంది. ఇదంతా చేసింది ఏ సాహసయాత్రలో భాగంగానో.. గిన్నిస్‌ రికార్డు సృష్టించేందుకో కాదు.. తన తల్లిదండ్రులను చూసేందుకు. జర్మనీకి చెందిన హాక్‌ విక్టర్‌ 2013లో ముంబయికి వచ్చాడు. అతడికి మేధాతో పరిచయం ఏర్పడింది. గతేడాది కొవిడ్‌ లాక్‌డౌన్‌ వేళ జర్మనీలో వారు వివాహం చేసుకున్నారు. కరోనా ఆంక్షల కారణంగా మేధా కుటుంబం పెళ్లికి వెళ్లలేకపోయింది. దీంతో నిరాశ చెందిన ఆమె.. ఆంక్షల సడలింపు తర్వాత తన కుటుంబాన్ని కలుసుకోవాలని నిశ్చయించుకుంది. ప్రయాణం ఎలా చేయాలన్న విషయంలో కాస్త వినూత్నంగా ఆలోచించింది. ద్విచక్రవాహనంపై ముంబయికి రావాలని నిర్ణయించుకుంది. అయితే బైక్‌పై వెనక కూర్చొని అంత దూరం ప్రయాణిస్తే వెన్నునొప్పి వచ్చే ప్రమాదముంటుందని గ్రహించి.. మరో ద్విచక్రవాహనాన్ని వారు కొనుగోలు చేశారు. భార్యాభర్తలిద్దరూ చెరో బైక్‌ నడుపుతూ ముంబయికి వచ్చేశారు. నిజానికి మేధాకు బండి నడపడం రాదు. ఈ ప్రయాణం కోసమే ఆమె డ్రైవింగ్‌ నేర్చుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని