Afghan: మహిళలపై వివక్షకు వ్యతిరేకంగా.. విద్యార్థుల వినూత్న నిరసన

అఫ్గాన్‌లో మహిళలపై వివక్షను నిరసిస్తూ బాలురు స్కూళ్లకు వెళ్లడం మానేశారు. కొంతమంది పాఠశాలలకు వెళుతున్నప్పటికీ....

Published : 19 Sep 2021 19:41 IST

కాబుల్‌: అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న అనంతరం తాలిబన్లు అక్కడి మహిళలు, యువతులపై అనేక ఆంక్షలు విధించారు. బాలికలకు పురుష ఉపాధ్యాయులు చదువు చెప్పకూడదని తేల్చి చెప్పారు. కాగా పలు ఆంక్షల నేపథ్యంలో అనేక మంది బాలికలు విద్యకు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే వారిపై వివక్షను నిరసిస్తూ బాలురు స్కూళ్లకు వెళ్లడం మానేశారు. కొంతమంది పాఠశాలలకు వెళుతున్నప్పటికీ.. సమాజంలో మహిళలు సగభాగం అని పేర్కొంటున్న కొందరు బాలురు పాఠశాలలకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో ఓ కథనం ప్రచురితమైంది.

బాలుర పాఠశాలలను తెరవాలంటూ అఫ్గాన్‌ విద్యాశాఖ మంత్రి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. పురుష టీచర్లందరూ బడులకు వెళ్లాలంటూ ఆదేశించారు. కానీ బాలికల పాఠశాలలు తెరవడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే వారి స్కూళ్లు తెరిచే వరకు మేము కూడా బడులకు వెళ్లమంటూ కొందరు విద్యార్థులు తేల్చి చెబుతున్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. ‘సమాజంలో మహిళలు సగభాగం అని అన్నారు. మరి ఇప్పుడెందుకు వారిపై ఆంక్షలు విధిస్తున్నారు? వారి పాఠశాలలు కూడా తెరిచేవరకు నేను స్కూలుకు వెళ్లను’ అని 12వ తరగతి విద్యార్థి రోహుల్లా అన్నాడు. మరికొందరు విద్యార్థులు సైతం ఇదేవిధంగా పేర్కొంటున్నట్లు జర్నల్‌ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని