Parliament: పార్లమెంటులో ‘మహిళా’ ప్రస్థానం కొనసాగుతోందిలా..!

మహిళా రిజర్వేషన్‌ చట్టం అమల్లోకి వస్తే.. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మొత్తం సభ్యుల్లో 33శాతం మంది మహిళలే ఉండనున్నారు.

Updated : 20 Sep 2023 12:15 IST

దిల్లీ: చట్టసభల్లో మహిళకు సముచిత స్థానం కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు (Women Reservation Bill) లోక్‌సభలోకి వచ్చింది. ఈ చట్టం అమల్లోకి వస్తే.. 33శాతం మంది మహిళా సభ్యులు లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో అడుగుపెట్టనున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఉభయ సభల్లో (Parliament) కొనసాగుతోన్న మహిళల ప్రస్థానాన్ని పరిశీలిస్తే..

1970 వరకు లోక్‌సభలో మహిళా సభ్యుల సంఖ్య 5శాతం మాత్రమే. సుదీర్ఘ కాలం తర్వాత.. 2009లో వీరి సంఖ్య 10శాతానికి చేరింది. అటు రాజ్యసభలోనూ అంతే. మహిళా ప్రాతినిధ్యం లోక్‌సభ కంటే కాస్త తక్కువగా ఉంది. 1951 నుంచి ఇప్పటివరకు మొత్తం సభ్యుల్లో 13శాతం ఎన్నడూ దాటలేదు. స్వాతంత్ర్యం అనంతరం లోక్‌సభలో మహిళా సభ్యులు గరిష్ఠ సంఖ్యలో అడుగుపెట్టింది కేవలం 2019లోనే. ఆ ఏడాది మొత్తం సభ్యుల్లో 15శాతం మహిళలు ఎన్నికయ్యారు. రాజ్యసభలో మాత్రం 2014లో గరిష్ఠంగా 12.7శాతం మంది మహిళలు అడుగుపెట్టారు.

డీలిమిటేషన్‌ తర్వాతే మహిళా రిజర్వేషన్లు..!

లోక్‌సభలో 1951లో మహిళా సభ్యుల సంఖ్య 5శాతం ఉండగా.. 1957లోనూ మారలేదు. 1962, 1967లో ఈ సంఖ్య 6శాతానికి పెరిగింది. 1971లో 5శాతం ఉండగా.. 1977లో 4శాతానికి పడిపోయింది. ఇలా 2009 వరకు రెండంకెల శాతాన్ని దాటలేకపోయింది. ఆ ఏడాది మహిళా సభ్యుల సంఖ్య 11శాతం నమోదుకాగా.. 2014లో 12శాతానికి చేరుకుంది. రాజ్యసభలో 1952లో మహిళా భాగస్వామ్యం 6.9శాతంగా ఉండగా.. 1960లో ఒకసారి 10శాతం దాటింది. 1980 వరకు మళ్లీ పదిలోపే కొనసాగింది. ఆ ఏడాది 12శాతానికి పెరిగింది. ఇలా కొంతకాలంగా ఎగువసభలో సరాసరిగా 10శాతం మంది మహిళలకు ప్రాతినిధ్యం లభిస్తోంది. 2020లో రాజ్యసభలో మహిళల సంఖ్య 10.2శాతంగా ఉంది.

ఇక రాష్ట్రాల శాసనసభల్లో మహిళా సభ్యుల సంఖ్య మరింత తక్కువగా ఉంటోంది. ఆయా రాష్ట్రాల అసెంబ్లీల మొత్తం సభ్యుల్లో 10శాతం కంటే తక్కువ ఉండటం గమనార్హం. రాష్ట్రాలు, పార్టీల వారీగా మహిళా సభ్యుల్లో భారీ వ్యత్యాసం ఉంది. ప్రస్తుత 17వ లోక్‌సభలో ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ నుంచి ఎక్కువ మంది మహిళలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తాజాగా మహిళా రిజర్వేషన్‌ చట్టం అమల్లోకి వస్తే ప్రస్తుత సభ్యుల్లో 182 మంది వారే ఉంటారు.

తాజాగా రాజ్యాంగం (128వ సవరణ) బిల్లు-2023ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కొత్త పార్లమెంటు భవనంలో ప్రవేశపెట్టిన తొలి బిల్లు కూడా ఇదే. రాష్ట్ర, జాతీయ స్థాయిలో విధాన రూపకల్పనలో మహిళా భాగస్వామ్యాన్ని పెంచేందుకు మహిళా రిజర్వేషన్‌ బిల్లు లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే చట్ట సభల్లో మహిళా పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపింది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు