Women Reservation Bill: మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవ ఆమోదం

చారిత్రక మహిళా రిజర్వేషన్‌ బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్‌ నిర్వహించి ఆమోదించారు.

Updated : 22 Sep 2023 01:25 IST

దిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లును (Women's Reservation Bill) రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. నారీ శక్తి వందన్‌ అధినియమ్‌ (Nari Shakti Vandan Adhiniyam) పేరుతో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ ఈ చరిత్రాత్మక బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో ఓటింగ్‌ ప్రక్రియ నిర్వహించగా.. ఈ చారిత్రక బిల్లుకు సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ బిల్లుకు అనుకూలంగా 214 మంది ఓటు వేశారు. పార్లమెంటు ఉభయసభల్లోనూ ఈ చరిత్రాత్మక బిల్లు ఆమోదం పొందడంతో దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరపడినట్టయింది. డీలిమిటేషన్‌ తర్వాత మహిళా రిజర్వేషన్లు అమలులోకి రానున్నాయి.

ఈ బిల్లుపై రాజ్యసభలో చేపట్టిన చర్చలో ఉభయ సభల నుంచి వివిధ పార్టీలకు చెందిన 132 మంది సభ్యులు భాగస్వాములయ్యారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ చర్చలోని ప్రతి పదం రాబోయే ప్రయాణంలో మనందరికీ ఉపయోగపడుతుందని.. ప్రతి విషయానికి దాని సొంత ప్రాముఖ్యత, విలువ ఉంటాయని తెలిపారు. ఈ బిల్లుకు మద్దతు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 

మహిళా రిజర్వేషన్‌ బిల్లును సెప్టెంబర్‌ 19న లోక్‌సభలో అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ ప్రవేశపెట్టగా.. 20వ తేదీ వరకు చర్చ జరిగింది. లోక్‌సభలో సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్‌ నిర్వహించగా 454 మంది ఎంపీలు అనుకూలంగా.. ఇద్దరు వ్యతిరేకంగా ఓటేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని