JNU: అమ్మాయిలకు జేఎన్‌యూ వివాదాస్పద సలహా.. తప్పుపట్టిన మహిళా కమిషన్‌

అమ్మాయిలు లైంగిక వేధింపులను ఎలా నివారించవచ్చో సలహా ఇస్తూ.. దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) అంతర్గత ఫిర్యాదుల కమిటీ(ఐసీసీ) జారీ చేసిన ఓ సర్క్యూలర్‌ వివాదాస్పదమైంది. లైంగిక వేధింపులపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు...

Published : 29 Dec 2021 01:48 IST

దిల్లీ: అమ్మాయిలు లైంగిక వేధింపులను ఎలా నివారించవచ్చో సలహా ఇస్తూ.. దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) అంతర్గత ఫిర్యాదుల కమిటీ(ఐసీసీ) జారీ చేసిన ఓ సర్క్యూలర్‌ వివాదాస్పదమైంది. లైంగిక వేధింపులపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు జనవరిలో నిర్వహించనున్న ఓ కౌన్సెలింగ్ సెషన్‌కు సంబంధించిన ఈ సర్క్యూలర్‌ను తన వెబ్‌సైట్‌లో ఉంచింది. ఇందులో ఒక చోట ‘అబ్బాయిలు కొన్నిసార్లు అనుకోకుండా, కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా.. స్నేహపూర్వక పరిహాసానికి, లైంగిక వేధింపులకు మధ్య ఉన్న సన్నని గీతను దాటుతారు. ఇలాంటి వేధింపులకు గురికాకుండా ఉండేందుకుగానూ అమ్మాయిలు.. వారికి, వారి మగ స్నేహితుల మధ్య ఒక స్పష్టమైన గీతను ఎలా గీయాలో తెలుసుకోవాలి’ అని ఉంది.

‘అన్ని సలహాలు అమ్మాయిలకే ఎందుకు?’

సర్క్యూలర్‌లోని ఈ సలహా కాస్త వివాదాస్పదం కావడంతో.. స్థానిక విద్యార్థి సంఘాలు దీనిపై నిరసన తెలిపాయి. జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సీడబ్ల్యూ) ఛైర్‌పర్సన్ రేఖా శర్మ సైతం దీన్ని తప్పుపట్టారు. స్త్రీ ద్వేషపూరిత సర్క్యూలర్‌గా పేర్కొంటూ.. వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాలని ట్వీట్‌ చేశారు. ‘అన్ని సలహాలు ఎప్పుడూ అమ్మాయిలకే ఎందుకు? వేధింపులకు పాల్పడేవారికి పాఠాలు నేర్పించే సమయం ఇది. బాధితులకు కాదు. ఈ సర్క్యూలర్‌ను జేఎన్‌యూ వెంటనే ఉపసంహరించుకోవాలి’ అని విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని