Womens Reservation Bill: మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఎంపీలకు అగ్నిపరీక్షే.. మోదీ కీలక వ్యాఖ్యలు..!

Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్‌ బిల్లు నేడు లోక్‌సభ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. బుధవారం నుంచి దీనిపై చర్చను ప్రారంభించనున్నట్లు సమాచారం.

Updated : 19 Sep 2023 16:52 IST

దిల్లీ: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లు (Women's Reservation Bill)కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. సోమవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఈ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi) కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ‘ఈ బిల్లు ఎంపీలకు అగ్నిపరీక్షే’ అని మోదీ అభివర్ణించినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా.. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలు పూర్తయిన తర్వాత 2027 నాటికి చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లను పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

నేడే లోక్‌సభ ముందుకు..

ఈ మహిళా రిజర్వేషన్‌ బిల్లును మంగళవారమే లోక్‌సభ (Lok Sabha) ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ ఈ బిల్లును నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబరు 20 (బుధవారం) నుంచి దిగువ సభలో ఈ బిల్లుపై చర్చను ప్రారంభించనున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి. ఇక, రాజ్యసభలో సెప్టెంబరు 21న బిల్లు (Women's Reservation Bill)ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే, తాజా బిల్లు 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లు కాదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్రం కొత్తగా మరో బిల్లును తీసుకొస్తున్నట్లు తెలిపాయి. అందువల్ల తాజా బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందాల్సి ఉంటుందని పేర్కొన్నాయి.

కేబినెట్‌ కీలక నిర్ణయం.. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్రం ఆమోదం!

ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే.. లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి. వాస్తవానికి మహిళా రిజర్వేషన్‌ బిల్లును 1996లో హెచ్‌డీ దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం తొలుత లోక్‌సభలో ప్రవేశపెట్టింది. తర్వాత వాజ్‌పేయీ, మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాల హయాంలోనూ ప్రవేశపెట్టినప్పటికీ ఈ బిల్లు సభ ఆమోదానికి నోచుకోలేదు. చివరకు ఈ బిల్లు 2010లో రాజ్యసభ ఆమోదం పొందినా లోక్‌సభలో మాత్రం పెండింగులోనే ఉండిపోయింది. 2014లో ఆ లోక్‌సభ రద్దు కావడంతో అక్కడ బిల్లు మురిగిపోయింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని