womens reservation bill: ‘ఇంటికెళ్లి వంట చేసుకోమన్నారు..!’ మహిళా బిల్లుపై ఎవరేమన్నారంటే..?

Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై లోక్‌సభలో నేడు వాడీ వేడీ చర్చ జరిగింది. అధికార, విపక్షాలు పరస్పరం వాదోపవాదాలకు దిగాయి. మరి ఈ బిల్లుపై ఎవరు ఏమన్నారంటే..?

Published : 20 Sep 2023 17:28 IST

దిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు (Women's Reservation Bill)పై లోక్‌సభలో బుధవారం సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా విపక్ష పార్టీలకు చెందిన పలువురు సభ్యులు ఈ బిల్లుపై మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. డీలిమిటేషన్‌కు ముందే ఈ రిజర్వేషన్లను అమలు చేయనప్పుడు.. ‘ప్రత్యేక’ సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేశారని కేంద్రాన్ని నిలదీశారు. ప్రతిపక్షాల వ్యాఖ్యలకు అటు అధికారపక్ష ఎంపీలు కూడా దీటుగానే బదులిచ్చారు. మరోవైపు, చర్చ సందర్భంగా అధికార, విపక్షం మధ్య వాదోపవాదాలు జరిగాయి.

ఇంటికెళ్లి వంట చేసుకోమన్నారు: సుప్రియా సూలే

ఈ చర్చ సందర్భంగా ప్రతిపక్ష కూటమిని ఉద్దేశించి భాజపా ఎంపీ నిషికాంత్ దూబే విమర్శలు గుప్పించారు. మహిళలను తక్కువ చేయాలని చూస్తున్న వారికి ‘ఇండియా’ కూటమి మద్దతు పలుకుతోందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule) తీవ్రంగా స్పందించారు. ‘‘గతంలో మహారాష్ట్రలో భాజపాకు చెందిన ఓ నేత ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆయన ఓసారి నాతో మాట్లాడుతూ.. ‘సూలేజీ మీరు ఇంటికెళ్లి వంట చేసుకోండి.. దేశ వ్యవహారాలు మేం చూసుకుంటాంలే’ అని అన్నారు. ఇది భాజపా ఆలోచనా విధానం. మహిళా చట్టసభ్యుల పట్ల భాజపా నాయకులు వ్యక్తిగత ఆరోపణలు చేసేవారు’’ అని సుప్రియా సూలే దుయ్యబట్టారు.

మాకు సెల్యూట్‌ అక్కర్లేదు: కనిమొళి

‘‘ఇది కేవలం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించే బిల్లు మాత్రమే కాదు.. అసమానతలు, పక్షపాత ధోరణిని తొలగించే బిల్లు. అయితే, దీన్ని జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే అమల్లోకి తెస్తామని బిల్లులో పేర్కొన్నారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంకెంతకాలం ఎదురుచూడాలి. ఈ బిల్లుకు నారీ శక్తి వందన్‌ అధినియమ్‌ అని పేరు పెట్టారు. మాకు సెల్యూట్‌ చేసి వందనాలు చేయనక్కర్లేదు. పీఠాలు వేసి పూజలు చేయాల్సిన అవసరం లేదు. సమానంగా గౌరవిస్తే చాలు’’ అని కనిమొళి (Kanimozhi) వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను ప్రస్తావిస్తూ.. ‘‘ఆమె శక్తిమంతమైన మహిళ అని అంగీకరించడానికి నాకు ఎలాంటి సంకోచాల్లేవు’’ అని తెలిపారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుతో రాజీవ్‌ గాంధీ కల నెరవేరింది: సోనియా గాంధీ

రెజ్లర్లను వేధించిన ఎంపీపై చర్యలేవీ: తృణమూల్‌ ఎంపీ

‘‘ఎన్నికల ముందు ఈ బిల్లును తీసుకురావడం పూర్తిగా భాజపా గిమ్మిక్కే. నిజంగా వారికి మహిళలంటే గౌరవం ఉంటే అది చేతల్లో చూపించాలి. మహిళలను వేధించిన, వారిని అగౌరవపర్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆటల్లో బంగారు పతకాలతో విశ్వ వేదికపై మన దేశ ప్రతిష్ఠను పెంచిన క్రీడాకారిణులు తమకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కారు. కానీ, అందుకు బాధ్యులైన వారు (భాజపా ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ను ఉద్దేశిస్తూ) ఇక్కడే కూర్చున్నారు. మహిళా సాధికారతపై మీరు నిజంగా దృష్టిసారిస్తే.. ఆ ఎంపీపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?’’ అని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ కకోలి ఘోష్‌ కేంద్రాన్ని ప్రశ్నించారు.

స్మృతి ఇరానీ మండిపాటు.

ఇదిలా ఉండగా.. మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సబ్‌ కోటా ఉండాలంటూ విపక్షాలు చేస్తున్న డిమాండ్లపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్రంగా మండిపడ్డారు. కులాల వారీగా కోటా అడుగుతూ విపక్షాలు దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఇక, రిజర్వేషన్లపై బిల్లును తాము ముందుగా తెచ్చామంటూ సోనియా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘సక్సెస్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. అదే ఓటమి ఎదురైతే ఎవరూ రారు. అందుకే, కొందరు ఈ బిల్లును తమదని చెబుతున్నారు’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని