Terror Attack: ఉగ్రదాడులకు ప్రతీకారం తప్పదు.. భారత్‌ వార్నింగ్‌

జమ్మూకశ్మీర్‌లోని కఠువా జిల్లాలో సైనికులపై జరిగిన ఉగ్రదాడి ఘటనపై కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ తీవ్రంగా స్పందించింది. సైనికుల మృతికి కారణమైన ముష్కరులపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. 

Published : 09 Jul 2024 14:28 IST

దిల్లీ: జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. ఇటీవల పర్యటకుల వాహనంపై దాడి ఘటనను మరువకముందే మరో ఘాతుకానికి పాల్పడ్డారు. కఠువా జిల్లాలో సైనిక వాహనంపై చేసిన మెరుపుదాడిలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. మరికొందరు సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన భారత రక్షణ మంత్రిత్వశాఖ.. ఉగ్ర చర్యలపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదుల అంతు చూస్తామని హెచ్చరించింది.

‘‘కఠువా జిల్లాలో జరిగిన ఉగ్ర దాడిలో ఐదుగురు సాహసవీరులను దేశం కోల్పోయింది. వారి మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. బాధిత కుటుంబాలకు భారత ప్రభుత్వం అండగా ఉంటుంది. దేశం కోసం జవాన్లు తమ ప్రాణాలు అర్పించి అమరులయ్యారు. వారి త్యాగాలు వృథా కానివ్వం. దీనికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం. ఈ దాడి వెనక ఉన్న దుష్టశక్తులను మట్టుపెడతాం’’ అని కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ సోషల్‌ మీడియా వేదికలో పేర్కొంది.

ముందు డ్రైవరే టార్గెట్‌.. ఉగ్ర వ్యూహం..!

కఠువా జిల్లాలోని మారుమూల ప్రాంతం మాచేడీలో సోమవారం సైనిక వాహనంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు వీర మరణం పొందారు. కాల్పులు జరిపిన అనంతరం పోలీసులు, పారామిలిటరీ దళాలు దీటుగా ప్రతిస్పందించడంతో సమీపంలోని అడవిలోకి ముష్కరులు పారిపోయారు. దీంతో వారిని మట్టుపెట్టేందుకు అదనపు బలగాలు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే సైనికుల మరణానికి కారణమైన ఉగ్రవాదులను వదిలే ప్రసక్తే లేదని కేంద్ర రక్షణశాఖ స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని