Karnataka: మా ఊరికి రోడ్డు వేసేవరకు పెళ్లే చేసుకోను.. సీఎం కార్యాలయానికి యువతి లేఖ

తమ గ్రామానికి సరైన రోడ్లు వేసేవరకు తాను పెళ్లే చేసుకోనని సీఎంఓ కార్యాలయానికి ఓ యువతి లేఖ రాసింది.....

Published : 18 Sep 2021 01:12 IST

బెంగళూరు: దేశంలోని అనేక చోట్ల రోడ్లు దయనీయంగా మారాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రోడ్ల పరిస్థితి గురించి చెప్పనక్కర్లేదు. తమ సమస్య తీర్చాలని అధికారులు, నేతల చుట్టూ తిరిగినా ఆ గ్రామస్థులకు మొండిచేయే ఎదురవుతోంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటకకు చెందిన ఓ ఉపాధ్యాయిని వినూత్న రీతిలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. తమ గ్రామానికి సరైన రోడ్లు వేసేవరకూ తాను పెళ్లే చేసుకోనని సీఎంఓ కార్యాలయానికి లేఖ రాసింది.

దేవంగరా జిల్లా హెచ్‌ రామ్‌పురా ప్రాంతానికి చెందిన బిందు(26) ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. తమ గ్రామంలో దయనీయ పరిస్థితిలో ఉన్న రోడ్లు, వాటివల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై కార్యాలయానికి ఓ లేఖ రాసింది. వెంటనే రోడ్లను బాగుచేయాలని కోరింది. ‘మా గ్రామానికి సరైన రోడ్డు సదుపాయం లేక ఇంకా వెనుకబడే ఉంది. రోడ్లు సరిగా లేక మా గ్రామస్థులు చదువుకోవడం లేదు. అందుకే పెళ్లి సంబంధాలు కూడా రావడంలేదు’ అని బిందు ఆ లేఖలో పేర్కొన్నారు.

ఉపాధ్యాయురాలు రాసిన లేఖకు సీఎంఓ కార్యాలయం స్పందించింది. మీ గ్రామ సమస్యను త్వరలోనే తీరుస్తామని హామీ ఇచ్చింది. అక్కడ తక్షణమే పనులు చేపట్టాలని గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయితీరాజ్ శాఖను సీఎంఓ కార్యాలయం ఆదేశించింది. జరుగుతున్న పనుల గురించి ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని