Fact-checking: జులై 10వరకు ఫ్యాక్ట్‌చెక్‌ యూనిట్‌పై ముందుకు వెళ్లం.. బాంబే హైకోర్టులో కేంద్రం

ఐటీ నిబంధనలను (IT Rules) సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జులై మొదటివారంలో విచారణ చేపడతామని బాంబే హైకోర్టు (Bombay HC) వెల్లడించింది.

Updated : 07 Jun 2023 15:15 IST

ముంబయి: నకిలీ, తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకు ఫ్యాక్ట్‌ చెక్ యూనిట్‌ (Fact-Checking unit) ఏర్పాటు నిర్ణయంపై జులై 10వరకు ముందుకు వెళ్లలేమని బాంబే హైకోర్టుకు (Bombay HC) కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. అంతకుముందు జులై 5 వరకు దీనిని ఏర్పాటు చేయమని చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఆ గడువును కాస్త పొడిగించింది. ఐటీ రూల్స్‌ (Iinformation Technology rules) చెల్లుబాటును సవాలు చేస్తూ స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రా దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని కోర్టుకు తెలిపింది. ఇదే సమయంలో ఐటీ నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన మరో రెండు పిటిషన్లపైనా జులై మొదటివారంలో విచారణ చేపడతామని బాంబే హైకోర్టు వెల్లడించింది.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఐటీ నిబంధనలపై బాంబే హైకోర్టులో తాజాగా మరో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇవి ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా, అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ మేగజైన్స్‌.. ఆ పిటిషన్లలో పేర్కొన్నాయి. వీటిని పరిశీలించిన జస్టిస్‌ గౌతమ్‌ పటేల్‌, జస్టిస్‌ నీలా గోఖలేలతో కూడిన హైకోర్టు ధర్మాసనం.. వీటిపై జులై 6 నుంచి విచారణ చేపడతామని పేర్కొంది. జులై 7వరకు పిటిషినర్లు తమ వాదనలు పూర్తిచేయాలని.. అనంతరం కేంద్ర ప్రభుత్వ వాదన వింటామని తెలిపింది. 

ఈ పిటిషన్ల విచారణ తేదీలను న్యాయస్థానం పేర్కొన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని.. ఫ్యాక్ట్‌చెక్‌ యూనిట్‌పై గతంలో కేంద్రం చెప్పిన తేదీని జులై 10వరకు పొడిగిస్తున్నట్లు అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అనిల్‌ సింగ్‌ వెల్లడించారు. ఇదిలాఉంటే, ఆన్‌లైన్‌ కంటెంట్‌లో నకిలీ, తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకుగాను ఫ్యాక్ట్‌చెక్‌ యూనిట్‌ను  (Fact-Checking unit) తీసుకువస్తామని కేంద్ర ప్రభుత్వం 2023, ఏప్రిల్‌ 26న పేర్కొంది. ఇందుకోసం ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రూల్స్‌-2021కు సవరణలు చేసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు