Uddhav: భాజపాదీ ‘రిక్షా’ పరిస్థితే.. అసలైన పోరాటం ఇప్పుడే మొదలైంది: ఉద్ధవ్‌ ఠాక్రే

కేంద్రంలోని మోదీ సర్కార్‌పై శివసేన (యూబీటీ) అధినేత, మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే విమర్శలు గుప్పించారు. 

Published : 15 Jun 2024 18:58 IST

ముంబయి: మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. శివసేన (యూబీటీ) నేతల ఫిరాయింపులు, ఎన్సీపీలో చీలికలు ఏర్పడినా.. అధికార కూటమితో పోలిస్తే మహా వికాస్‌ అఘాడి (ఎంవీయే) లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటింది. దీంతో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కూటమి కసరత్తు ప్రారంభించింది. తమ విజయంపై మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) స్పందించారు. ఇది ఎంవీయేకు అంతిమ విజయం కాదని వ్యాఖ్యానించారు.

‘‘భాజపాను ఎవరూ ఓడించలేరని ఊహించారు. కానీ, ఈ భావనను సవాల్‌ చేయడంలో మహారాష్ట్ర ప్రజలు కీలకపాత్ర పోషించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎంవీయే సాధించిందే అంతిమ విజయం కాదు. అసలైన పోరాటం ఇప్పుడే మొదలైంది. రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది’’ అని కూటమి నేతలతో కలిసి ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్న ఉద్ధవ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

అది మోదీ సర్కార్‌ కాదు..

ఎంవీఏ ప్రభుత్వాన్ని మూడు చక్రాల రిక్షాగా గతంలో డిప్యూటీ సీఎం ఫడణవీస్‌ వ్యాఖ్యానించడాన్ని గుర్తు చేస్తూ.. ఎన్డీఏ కూటమిపై ఉద్ధవ్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం కేంద్రంలోని భాజపా ప్రభుత్వానిది అదే పరిస్థితి అని ఎద్దేవా చేశారు. ‘‘ప్రస్తుతం కేంద్రంలో ఉన్నది మోదీ సర్కార్ కాదు.. ఎన్డీయే ప్రభుత్వం. ఇది ఎంతకాలం అధికారంలో కొనసాగుతుందో వేచి చూడాలి’’ అని ఉద్ధవ్‌ వ్యాఖ్యానించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడి.. శిందే వర్గంలో చేరిన ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘ఆ వీడియో తొలగించండి’: సునీతా కేజ్రీవాల్‌కు దిల్లీ కోర్టు నోటీసులు

వారికి ఇక చోటు లేదు..

‘‘నాడు పార్టీ విడిచి.. ప్రస్తుతం తిరిగి రావాలనుకుంటున్నవారికి ఇక్కడ చోటు లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని పార్టీలో చేర్చుకోబోయేది లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా ఎంవీయే అధికారంలోకి వస్తుంది. అందుకు సమష్టిగా కృషి చేస్తున్నాం’’ అన్ని ఉద్ధవ్‌ పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని