PM Modi: 3 రెట్ల వేగంతో పనిచేస్తా

భారత్‌ గత పదేళ్లలో సాధించిన విజయాలను ప్రపంచం గుర్తిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచ అభివృద్ధి అధ్యాయాన్ని భారత్‌ లిఖిస్తోందని తెలిపారు.

Published : 10 Jul 2024 04:40 IST

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను చేస్తా
రష్యాలో ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ వ్యాఖ్య

మాస్కో: భారత్‌ గత పదేళ్లలో సాధించిన విజయాలను ప్రపంచం గుర్తిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచ అభివృద్ధి అధ్యాయాన్ని భారత్‌ లిఖిస్తోందని తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా మంగళవారం ప్రవాస భారతీయులతో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ప్రసంగించారు. రష్యా పర్యటనకు తానొక్కడినే రాలేదని, 140 కోట్ల మంది ప్రేమను, దేశ మట్టి వాసనను తీసుకొచ్చానని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో సమావేశ మందిరం కరతాళ ధ్వనులతో మార్మోగింది. ‘ఇటీవలే మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణం చేశాను. మూడు రెట్ల వేగంతో పని చేయాలని నిర్ణయించుకున్నా. ప్రస్తుతం ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌ను మూడో ఆర్థిక శక్తిగా నిలబెడతా. ఏ దేశానికీ సాధ్యం కాని విధంగా చంద్రయాన్‌ ప్రయోగం చేశాం. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్‌ గుర్తింపు పొందింది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

భారతే నంబర్‌వన్‌

డిజిటల్‌ లావాదేవీల్లో ప్రపంచంలోనే భారత్‌ నంబర్‌వన్‌గా ఉందని గుర్తు చేసిన ప్రధాని మోదీ.. అంకుర పరిశ్రమల్లో (స్టార్టప్‌లు) ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్నామని తెలిపారు. 2014లో వందల్లో ఉన్న స్టార్టప్‌లు నేడు లక్షల్లోకి చేరాయని చెప్పారు. భారత్‌ రికార్డు స్థాయిలో పేటెంట్లను సాధిస్తోందని వెల్లడించారు. దేశంలోని ప్రతి ఒక్కరిలోనూ ఆత్మ విశ్వాసం నింపుతున్నామని, అదే భారత్‌కు అతి పెద్ద ఆయుధమని చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య బీమా వ్యవస్థ భారత్‌లోనే ఉందని గుర్తు చేశారు. గత పదేళ్లలో భారత్‌ సాధించింది కేవలం ట్రైలర్‌ మాత్రమేనని, రాబోయే పదేళ్లలో అసలు సినిమా చూపిస్తామని తెలిపారు. అన్ని సవాళ్లను ఎదుర్కోవడం తన డీఎన్‌ఏలోనే ఉందని మోదీ స్పష్టం చేశారు. 

పుతిన్‌పై ప్రశంసలు

రెండు దశాబ్దాలుగా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పాత్రపై మోదీ ప్రశంసలు కురిపించారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం వేళ భారత విద్యార్థులు చిక్కుకుపోతే వారిని కాపాడటంలో పుతిన్‌ సహకరించారని గుర్తు చేశారు. ‘భారత్, రష్యా నమ్మకమైన మిత్రులు. పరస్పర విశ్వాసం, గౌరవం ఆధారంగా ఈ స్నేహం కొనసాగుతోంది. రష్యాలో చలికాలంలో ఉష్ణోగ్రతలు ఎంత మైనస్‌లోకి పడిపోయినా సరే, మన రెండు దేశాల మధ్య బంధం ఎప్పుడూ ప్లస్‌లోనే ఉంటుంది. అది మన స్నేహాన్ని ఆహ్లాదంగా ఉంచుతుంది. ఇప్పటివరకు నేను 6 సార్లు రష్యాలో పర్యటించాను. పుతిన్‌తో 17 సార్లు భేటీ అయ్యాను. ఉన్నత విద్య కోసం భారతీయులు రష్యా వస్తున్నారు. ఇక్కడ మరో రెండు కాన్సులేట్‌ కార్యాలయాలను ప్రారంభిస్తాం’ అని మోదీ తెలిపారు. వాటిని కజన్, ఎకతెరీన్‌బర్గ్‌లలో ప్రారంభిస్తామని వెల్లడించారు. 

టీమిండియా విజయ రహస్యం అదే

‘ఇటీవల టీమిండియా టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన సందర్భాన్ని మీరు ఇక్కడ పండగ చేసుకుని ఉంటారు. గెలుపు కోసం వారు పడిన ఆరాటం..అందుకు సాగించిన ప్రయాణమే వారి విజయం వెనుక ఉన్న అసలు కథ. ఈ రోజుల్లో యువత చివరి క్షణం (చివరి బంతి) వరకూ ఓటమిని అంగీకరించడం లేదు. అలా ముందుకుసాగే వారినే విజయం వరిస్తుంది’ అని రోహిత్‌ సేనను ప్రధాని కొనియాడారు. అలాగే ఇరు దేశాల సంబంధాలు బలోపేతం కావడంలో సినిమాలది కీలకపాత్రని చెప్పారు. ఈ సందర్భంగా అలనాటి ప్రముఖ నటులు రాజ్‌ కపూర్‌ చిత్రంలోని పాటను గుర్తు చేసుకున్నారు. మిథున్‌ చక్రవర్తి ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయనకు ఇక్కడ ఎంతో మంది అభిమానులున్నారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని