మోదీకి అంతర్జాతీయ ప్రముఖుల శుభాకాంక్షలు

ప్రధాని మోదీ 70వ జన్మదినం సందర్భంగా అంతర్జాతీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ఫిన్లాండ్‌ ప్రధాని సన్నా మారిన్‌, నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి తదితరులు...

Published : 17 Sep 2020 15:03 IST

దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ 70వ జన్మదినం సందర్భంగా వివిధ దేశాధినేతలు, అంతర్జాతీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ఫిన్లాండ్‌ ప్రధాని సన్నా మారిన్‌, నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి తదితరులు మోదీకి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా గతేడాది జరిగిన ఇండో-జర్మన్‌ సమావేశాలను మెర్కెల్‌ గుర్తు చేసుకున్నారు.

‘‘భవిష్యత్‌లో మీకు అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొన్న తరుణంలో మీరు పూర్తి ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలి’’ అని మెర్కెల్‌ సందేశం పంపారు. దీనిని పీఎంవో ట్విటర్‌లో పోస్టు చేసింది. గత కొన్నేళ్లుగా భారత్‌ జర్మనీల మధ్య సంబంధాలు ఫలితాలనిచ్చాయని, భవిష్యత్‌లోనూ ఇరుదేశాల మధ్య సంబంధాలు ఇలాగే కొనసాగాలని భావిస్తున్నానని మెర్కెల్‌ తెలిపారు. రాజకీయంగానూ మోదీ మరిన్ని విజయాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు.

ప్రధాని మోదీ స్నేహానికి ఎంతో విలువనిస్తారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అన్నారు. మోదీ స్నేహ స్వభావమే శాస్త్ర సాంకేతిక పరంగా, సామాజికంగా, ఆర్థికంగా భారత్‌ను అభివృద్ధి చేస్తోందని కితాబిచ్చారు. ‘‘మనిద్దరి మధ్య కుదిరిన స్నేహ ఒప్పందాలకు నేనెంతో విలువనిస్తాను. భవిష్యత్‌లోనూ ఇదే కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. మీ ఆరోగ్యం బాగుండాలని, ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని పుతిన్‌ సందేశం పంపారు.

భారత్‌-ఫిన్లాండ్‌ల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నట్లు ఆ దేశ ప్రధాని సన్నా మారిన్‌ తెలిపారు. యూనియన్‌తో సత్సంబంధాలను కొనసాగించడానికి భారత్‌కు పూర్తి మద్దతు ఇస్తామని వెల్లడించారు. ప్రధాని మోదీ ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలీ కూడా ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇరుదేశాల అభివృద్ధికి కలిసి పని చేద్దామని అన్నారు. ‘‘ 70వ జన్మదినం సందర్భంగా భారత ప్రధాని మోదీకి శుభాకాంక్షలు. మీరు పూర్తి ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నా. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపర్చుకోవడానికి భారత్‌తో కలిసి పని చేస్తాం’’ అని ఓలీ ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు