Afhanistan: అఫ్గాన్‌ను కరుణించిన ప్రపంచ బ్యాంక్‌.. 280 మిలియన్‌ డాలర్లు సాయం!

అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకోగానే ఆ దేశం తాలిబన్ల హస్తగతమైన విషయం తెలిసిందే. మూడునెలులగా అఫ్గాన్‌లో తాలిబన్ల అరాచక పాలన సాగుతోంది. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది. పేదరికం పెరుగుతోంది. ఆహార కొరత ఏర్పడటంతో ప్రజలంతా ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో అఫ్గాన్‌కు

Published : 02 Dec 2021 23:25 IST

వాషింగ్టన్‌: అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకోగానే ఆ దేశం తాలిబన్ల హస్తగతమైన విషయం తెలిసిందే. మూడు నెలలుగా అఫ్గాన్‌లో తాలిబన్ల అరాచక పాలన సాగుతోంది. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది. పేదరికం పెరుగుతోంది. ఆహార కొరత ఏర్పడటంతో ప్రజలంతా ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో అఫ్గాన్‌కు సహాయం చేయడానికి ప్రపంచ బ్యాంక్‌ ముందుకొచ్చింది. అక్కడి ప్రజల్ని ఆదుకోవడం కోసం అఫ్గానిస్థాన్‌ పునర్నిర్మాణ ట్రస్ట్‌ ఫండ్‌(ఏఆర్‌టీఎఫ్‌) నుంచి 280 మిలియన్‌ డాలర్లను రెండు ఐరాస అనుబంధ సంస్థలకు బదిలీ చేయడానికి ప్రపంచ బ్యాంక్‌ బోర్డు ఆమోదం తెలిపింది.

తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో వివిధ దేశాల్లోని బ్యాంకులు అఫ్గానిస్థాన్‌ నిధుల్ని స్తంభింపజేశాయి. ఆ నిధులపై తమకు హక్కుందని, వాటిని వెంటనే విడుదల చేయాలని తాలిబన్‌ ప్రభుత్వం అభ్యర్థించినా.. డిమాండ్‌ చేసినా ఆయా బ్యాంకులు నిధుల విడుదలకు ససేమిరా అంటున్నాయి. అయితే, అఫ్గానిస్థాన్‌ పరిస్థితుల్ని అర్థం చేసుకున్న ప్రపంచ బ్యాంక్‌.. నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. ట్రస్ట్‌ ఫండ్‌లో ఉన్న 1.5 బిలియన్‌ డాలర్ల నుంచి 500 మిలియన్‌ డాలర్లు విడుదల చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో మొదటగా 280 మిలియన్‌ డాలర్ల నిధులను ఐరాస అనుబంధ సంస్థలు.. యూనిసెఫ్‌, ప్రపంచ ఆహార సంస్థలకు మళ్లించడానికి సిద్ధమైంది. అయితే, ఇందుకు ఏఆర్‌టీఎఫ్‌కు విరాళాలు ఇచ్చిన 31 మంది దాతల ఆమోదం అవసరమవుతుందనీ.. ఇందుకోసం దాతలంతా శుక్రవారం సమావేశం కానున్నట్లు ప్రపంచ బ్యాంక్‌ వర్గాలు తెలిపాయి. 

Read latest National - International News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని