టీకా పంపిణీ: 100 కోట్ల డోసులు పూర్తి!

ప్రపంచంలో 172 దేశాల్లో టీకా అందుబాటులోకి రాగా ఆయా దేశాల్లో ఇప్పటివరకు 100కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Published : 25 Apr 2021 14:24 IST

143 రోజుల్లోనే 100కోట్ల మార్క్‌

వాషింగ్టన్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ఇప్పటికే ప్రపంచంలో 172 దేశాల్లో టీకా అందుబాటులోకి వచ్చింది. ఆయా దేశాల్లో ఇప్పటి వరకు 100కోట్ల డోసులను పంపిణీ చేశారు. దీంతో ప్రపంచ జనాభాలో దాదాపు 6.6శాతం మంది పూర్తి స్థాయిలో వ్యాక్సిన్‌ తీసుకున్నారు. టీకా పంపిణీలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ వీటిని అధిగమించేందుకు ఆయా దేశాలు కృషిచేస్తున్నాయి.

143 రోజుల్లోనే ఈ ఘనత..

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోన వైరస్‌ మహమ్మారిపై జరుగుతోన్న పోరులో యావత్‌ ప్రపంచం ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా అనతికాలంలోనే కొవిడ్‌-19ని ఎదుర్కొనే టీకాను తయారు చేయడంతో పాటు వాటి పంపిణీని అంతే వేగంతో చేపడుతోంది. గతేడాది డిసెంబర్‌ 2వ తేదీన ఫైజర్‌ టీకా వినియోగానికి బ్రిటన్‌ ఆమోదం తెలిపిన తొలి దేశంగా నిలిచింది. డిసెంబర్‌ 8, 2020 రోజున వ్యాక్సిన్‌ పంపిణీని ప్రారంభించింది. తొలి టీకా తీసుకున్న మహిళ మార్గరెట్‌ కీనన్‌(90ఏళ్లు) అనే బ్రిటన్‌ మహిళ రికార్డు సృష్టించారు. అలా మొదలైన వ్యాక్సిన్‌ పంపిణీ ప్రయాణం.. ఐదు నెలలు పూర్తికాకముందే ప్రపంచ వ్యాప్తంగా 100కోట్ల డోసులను పంపిణీ చేయగలిగారు. వ్యాక్సిన్‌ వినియోగానికి ఆమోదం తెలిపిన 143 రోజుల్లోనే (ఏప్రిల్‌ 24నాటికి) వందకోట్ల మార్కును దాటడం విశేషం. ఇప్పటి వరకు పంపిణీ అయిన 100కోట్ల డోసుల్లో కొందరు తొలి డోసు తీసుకోగా, మరికొందరు రెండు డోసులను తీసుకున్నారు.

టీకా పంపిణీని అత్యధిక వేగంగా చేపడుతోన్న దేశాల్లో అగ్రరాజ్యం అమెరికా ప్రపంచంలోనే ముందుంది. ఇప్పటివరకు అక్కడ 22కోట్ల డోసులను పంపిణీ చేశారు. అమెరికా జనాభాలో మొత్తం 35శాతం మందికి (దాదాపు 42శాతం మంది తొలిడోసు, 28శాతం రెండు డోసులు తీసుకున్నారు) పంపిణీ జరిగింది. ఇక తర్వాతి స్థానంలో ఉన్న చైనాలో ఇప్పటికే 21కోట్ల డోసులను అందించినట్లు సమాచారం. టీకా పంపిణీలో మూడో స్థానంలో ఉన్న భారత్‌లో ఇప్పటి వరకు 14కోట్ల డోసులను అందించారు. యూరోపియన్‌ యూనియన్‌(12కోట్లు), బ్రిటన్‌(4.5కోట్లు), బ్రెజిల్‌(4కోట్లు) దేశాలు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ముమ్మరంగా చేపడుతున్నాయి. ఇక దేశ జనాభాలో అత్యధిక మందికి టీకా అందించిన దేశంగా ఇజ్రాయెల్‌ నిలిచింది. ఇప్పటికే అక్కడి జనాభాలో 57శాతం మందికి టీకా పంపిణీ పూర్తిచేసింది.

సవాళ్ల నడుమ కొనసాగుతున్న పంపిణీ..

కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో ప్రపంచ దేశాలు కనీవిని ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ సమయంలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం ప్రపంచ దేశాల్లో కొత్త ఆశలు రేకెత్తించింది. దీంతో వ్యాక్సిన్‌ పంపిణీపైనే యావత్‌ ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. ఈ ప్రక్రియలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా వ్యాక్సిన్ దుష్ర్పభావాలు, వ్యాక్సిన్‌ ఉత్పత్తి, సరఫరాలో అంతరాయంతో పాటు పేద, ధనిక దేశాల మధ్య వ్యాక్సిన్‌ సరఫరాలో అసమానతల వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. వీటితో పాటు కొత్తరకం వేరియంట్‌లు పుట్టుకురావడం అతిపెద్ద సవాల్‌గా మారింది. అయినప్పటికీ, ఓ వైపు వైరస్ వ్యాప్తిని కట్టడి చేస్తూనే మరోవైపు టీకా పంపిణీ ముమ్మరంగా చేపట్టేందుకు ఆయా దేశాలు కృషి చేస్తున్నాయి.

అనతి కాలంలోనే వ్యాక్సిన్‌ అభివృద్ధి..

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు చేసిన కృషితో స్వల్పకాలంలోనే కొవిడ్‌ టీకా అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా ఒక వ్యాక్సిన్‌ రావడానికి 5 నుంచి 10ఏళ్ల సమయం పడుతుంది. కానీ, శాస్త్రవేత్తలు కృషి ఫలితంగా కేవలం పది నెలల్లోనే కరోనాను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా టీకాల పనితీరుపై తాజాగా వస్తోన్న వాస్తవ ఫలితాలు(టీకా ప్రయోగాల ఫలితం కాకుండా) కూడా ఊరట కలిగిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన టీకాలు 70 నుంచి 95శాతం సమర్థత చూపించడం శాస్త్రవేత్తల విజయంగా అభివర్ణిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని