వీడియో: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌ చూశారా?

1315 మీటర్లు పొడవు.. 467 మీటర్ల ఆర్చ్‌.. రోజూ 500మంది వర్కర్లు.. 331 మీటర్ల ఎత్తులో పని..

Updated : 05 Apr 2021 20:00 IST

న్యూదిల్లీ: 1315 మీటర్లు పొడవు.. 467 మీటర్ల ఆర్చ్‌.. రోజూ 500మంది వర్కర్లు.. 331 మీటర్ల ఎత్తులో పని.. 25 మెట్రిక్‌ టన్నుల బరువును మోసే సామర్థ్యం వెరసి ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్‌ను నిర్మిస్తోంది భారతీయ రైల్వేస్‌.

జమ్మూ-కశ్మీర్‌లో చీనాబ్‌ నదిపై ఉదంపూర్‌-శ్రీనగర్‌-బారముల్లా రైల్వే లింక్‌ ప్రాజెక్టు కింద 111 కిలోమీటర్ల విస్తీర్ణంలో భాగంగా కొంకణ్‌ రైల్వేస్‌ ఈ బ్రిడ్జ్‌ నిర్మాణం చేపట్టింది. తాజాగా ఈ బ్రిడ్జ్‌కు సంబంధించిన ఆర్చ్‌ నిర్మాణం పూర్తయింది. ఇందుకు సంబంధించిన స్పెషల్‌ వీడియోను కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘భారత్‌దేశం గర్వించే సందర్భం. కశ్మీర్‌-కన్యాకుమారిలను కలిపే చీనాబ్‌ బ్రిడ్జ్‌ ఆర్చ్‌ నిర్మాణం పూర్తయింది. 467 మీటర్ల పొడవైన ఆర్చ్‌ను కలిగిన ఈ రైల్వే బ్రిడ్జ్‌ ప్రపంచంలోనే ఎత్తైనది. ప్రధాని నరేంద్రమోదీ విజన్‌తో స్ఫూర్తి పొంది రైల్వే కుటుంబం భారత్‌ను అత్యున్నత శిఖరాల్లో నిలబెట్టింది’ అని ట్వీట్‌ చేశారు. ‘ప్రస్తుతం ఆర్చ్‌ నిర్మాణం పూర్తయింది. మిగిలిన పనులను త్వరలోనే పూర్తి చేస్తాం. ఏడాదిలోపే ఈ బ్రిడ్జ్‌ అందుబాటులోకి తీసుకొస్తాం’ అని కొంకణ్‌ రైల్వేస్‌ ఛైర్మన్‌, ఎండీ, సంజయ్‌ గుప్తా తెలిపారు

చీనాబ్‌ వంతెన ప్రత్యేకతలు

* 2004లోనే దీని నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కాగా ఈ ప్రాంతంలో గాలి వేగం అధికంగా ఉండటంతో భద్రత దృష్ట్యా 2008-09 కాలంలో పనులు నిలిచిపోయాయి.

* పారిస్‌లోని ఇంజినీరింగ్‌ అద్భుతమైన ఈఫిల్‌ టవర్‌ కన్నా 35 మీటర్ల ఎత్తులో ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.

* 2017 నుంచి వంతెనకు స్టీల్‌ ఆర్చ్‌ను ఏర్పాటు చేయడం ప్రారంభించారు.

* ఈ బ్రిడ్జ్‌ ద్వారా కశ్మీర్‌ ప్రాంతాల నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలను తక్కువ సమయంలో చేరుకోవచ్చు.

* బ్రిడ్జ్‌ పూర్తి పొడవు 1315 మీటర్లు

* చీనాబ్‌ నదిని దాటేందుకు నిర్మించిన ఆర్చ్‌ పొడవు 467 మీటర్లు

* నదీ ఉపరితలం నుంచి 359 మీటర్ల ఎత్తు

* చీనాబ్‌ నదిపై బ్రిడ్జ్‌ నిర్మించిన ప్రాంతంలో అత్యధికంగా గాలులు వీస్తాయి. 7 డిగ్రీల ఉష్ణోగ్రతలో రోజూ 500లకు పైగా కార్మికులు  పనిచేసేవారు.

* బ్రిడ్జ్‌ నిర్మాణానికి కావాల్సిన పరికరాలన్నీ ముందుగానే తయారు చేసుకుని ఆ తర్వాత క్రేన్‌ల సాయంతో పైకి తీసుకెళ్లేవారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని