Odisha Train Tragedy: భారత్‌కు అండగా ఉన్నాం.. రైలు ప్రమాదంపై ప్రపంచ నేతలు!

ఒడిశా రైలు ప్రమాదంపై పుతిన్‌, కిషిదా తదితర ప్రపంచ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో భారత్‌కు అండగా ఉన్నామని తెలిపారు.

Published : 03 Jun 2023 16:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒడిశాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం (Odisha Train Tragedy)పై అంతర్జాతీయంగా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Putin), జపాన్‌ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదా మొదలు ఐరాస జనరల్‌ అసెంబ్లీ అధ్యక్షుడు కోరోసి వరకు ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాధినేతలు (World Leaders), ప్రముఖులు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

* ఒడిశాలో జరిగిన రైలు దుర్ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. జపాన్ ప్రభుత్వం, ప్రజల తరఫున సంతాపాన్ని తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. - ఫుమియో కిషిదా, జపాన్‌ ప్రధాని

రైలు ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారి బాధను మేం పంచుకుంటాం. క్షతగాత్రులు త్వరితగతిన కోలుకోవాలని ఆశిస్తున్నాం. - పుతిన్‌, రష్యా అధ్యక్షుడు

భారత్‌లో జరిగిన రైలు ప్రమాద దృశ్యాలు కలవరపర్చాయి. తమ ప్రియమైనవారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ క్లిష్ట సమయంలో కెనడియన్లు భారత ప్రజలకు అండగా ఉన్నారు. - జస్టిన్‌ ట్రూడో, కెనడా ప్రధాని

రైలు ఘటనలో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం బాధ కలిగించింది. ఈ దుఃఖ సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నా. - పుష్పకమల్‌ దహల్, నేపాల్‌ ప్రధాని

ఒడిశాలో రైలు ప్రమాదం విషాదకరం. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నా. - కొరోసి, యూఎన్‌జీఏ అధ్యక్షుడు

భారత్‌లో జరిగిన రైలు ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఈ ఘటనలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. - షెహబాజ్‌ షరీఫ్‌, పాక్‌ ప్రధాని

ఒడిశా విషాద ఘటన దిగ్ర్భాంతికరం. ఉక్రెయిన్ ప్రజల తరఫున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోపాటు బాధితుల కుటుంబీకులు, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. - జెలెన్‌స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు

* మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ఈ ఘటనపై ఐరోపా సంతాపం వ్యక్తం చేస్తోంది. - ఉర్సులా వాన్‌డెర్‌ లెయన్‌, ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలు

రైలు దుర్ఘటనతో ప్రభావితమైన ప్రతి ఒక్కరి కోసం తైవాన్ ప్రార్థిస్తోంది. బాధితులకు, వారి కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నా. - సాయ్‌ ఇంగ్‌-వెన్‌, తైవాన్‌ అధ్యక్షురాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని