తుది అంకానికి కరోనాపై పోరు!

యావత్‌ ప్రపంచం కరోనా మహమ్మారిపై ఓడించేందుకు చేస్తున్న పోరు తుది దశకు చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోవడంలో........

Updated : 27 Jan 2021 08:46 IST

డబ్ల్యూహెచ్‌వో సదస్సులో హర్షవర్ధన్‌

దిల్లీ: కరోనా మహమ్మారిని ఓడించేందుకు యావత్‌ ప్రపంచం చేస్తున్న పోరు తుది దశకు చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోవడంలో భాగంగా ప్రపంచ దేశాలు చూపిన చొరవ, అనుసరించిన ముందస్తు వ్యూహాలు, పరస్పర సహకారం వల్లే ఇది సాధ్యమయిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ దిశగా కృషి చేసిన ప్రతి దేశానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వర్చువల్‌గా జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఎగ్జిక్యూటివ్‌ బోర్డు 148వ వార్షిక సమావేశంలో మంగళవారం రాత్రి ఆయన ప్రసంగించారు.

కరోనా కారణంగా తలెత్తిన కష్టాల వల్ల శాస్త్రవిజ్ఞాన రంగ ప్రాముఖ్యత మరోసారి నిరూపితమైందన్నారు. 2020 పూర్తిగా శాస్త్రవిజ్ఞాన రంగానిదే అని వ్యాఖ్యానించారు. మహమ్మారి తెచ్చిపెట్టిన ప్రతికూల పరిస్థితుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులు ఏకతాటిపైకి వచ్చే అవకాశం కలిగిందన్నారు. ప్రభుత్వాలు, వ్యాపార రంగం, దాతృత్వ సంస్థలు వనరుల్ని సమకూర్చేందుకు ముందుకు వచ్చాయని కొనియాడారు. వైరస్‌ ముప్పు ఇంకా పూర్తిగా తొలగని నేపథ్యంలో.. ప్రపంచదేశాలు మహమ్మారి అంతానికి తీసుకుంటున్న చర్యల్ని మరింత పటిష్ఠంగా అమలు చేయాలని హితవు పలికారు. ప్రతి పౌరుడికీ వైద్య సదుపాయం అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

యావత్‌ ప్రపంచం సురక్షితంగా ఉంటేనే మనం భద్రంగా ఉన్నట్లని.. లేదంటే ముప్పు తప్పదని హర్షవర్ధన్‌ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రతి దేశం మహమ్మారి విముక్తిగా మారే దిశగా కలిసికట్టుగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. పేద, మధ్యాదాయ దేశాలకు కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేలా డబ్ల్యూహెచ్‌వో నేతృత్వంలో సభ్యదేశాలు చర్యలు తీసుకున్నాయని గుర్తుచేశారు. కరోనా తర్వాత అనేక సవాళ్లు ఎదురుకానున్నాయని.. వీటి పరిష్కారంలో డబ్ల్యూహెచ్‌వో సమర్థమైన వ్యూహాలతో మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సభ్యదేశాలన్నింటిలో వైద్యారోగ్య వ్యవస్థని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి...

బ్రిటన్‌ ప్రయాణికుల్లో పాజిటివ్‌ కలకలం

కొవిడ్‌ టీకాలు సత్వరం వినియోగించాలి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని