భారత్‌ను చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోంది: షా

కరోనా కాలంలో ఘోరంగా దెబ్బతిన్న ఆర్థిక స్థితి నుంచి భారత్‌ కోలుకున్న విధానం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు.

Updated : 21 Jan 2021 19:28 IST

ఆర్థిక పునరుద్ధరణ గొప్పగా ఉందన్న హోంమంత్రి

దిల్లీ: కరోనా కాలంలో ఘోరంగా దెబ్బతిన్న ఆర్థిక స్థితి నుంచి భారత్‌ కోలుకున్న విధానం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. గురువారం గుజరాత్‌లోని షిలాజ్‌లో నాలుగులైన్ల ఓవర్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అమిత్‌ షా వర్చువల్‌ విధానంలో పాల్గొన్నారు. ‘‘ కరోనాతో ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు తల్లకిందులయ్యాయి. కానీ భారత్‌ ‘వి’ఆకారపు ఆర్థిక వృద్ధి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. గతేడాది జూన్‌లో లాక్‌డౌన్‌ కారణంగా భారత జీడీపీ 23.9శాతం క్షీణించింది. సెప్టెంబరు నాటికి ఈ క్షీణత 7.5శాతానికి చేరింది. అప్పటికి అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభమైంది. పండుగల సీజన్‌ అయిన డిసెంబరు నాటికి ఆర్థిక వ్యవస్థ కాస్త మెరుగైంది. ప్రస్తుతం 7.7శాతం క్షీణతతో జీడీపీ ముగుస్తుందని కేంద్రం అంచనా వేస్తోంది.’’ అని అమిత్‌ షా అన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జరుగుతున్న టీకా పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని ఆయన తెలిపారు. అందరికీ వ్యాక్సిన్‌లు అందించి, భారత్‌ మహమ్మారిపై విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

గత 20 ఏళ్లలో ఇతర ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధిని మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆరేళ్లలో చేసి చూపించిందని హోంమంత్రి అన్నారు. కేంద్రం మెట్రో రైళ్లు, బుల్లెట్‌ ట్రైన్‌ వంటి అనేక ప్రాజెక్టులను ప్రారంభించిందన్నారు. దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలకు కరెంటు సదుపాయం, రోడ్లు, ఇంటికొక బ్యాంకు ఖాతా వంటి అనేక మౌలికసదుపాయాలను కల్పించారన్నారు. ఇప్పటికీ దేశంలోని 30కోట్ల మంది ప్రజలకు సొంత ఇళ్లు లేవన్నారు. 2022కల్లా అందరికీ సొంతఇళ్లు అందేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా జాతీయ, రాష్ట్రీయ హైవేలపై ఉన్న లక్ష రైల్వే క్రాసింగులను తొలగించి పైవంతెనలు, అండర్‌ బ్రిడ్జిల నిర్మాణం ప్రారంభించిందన్నారు. ఇప్పటికే 5వేల క్రాసింగుల నిర్మాణం పూర్తైందన్నారు. మరో 8వేల క్రాసింగు వంతెనల నిర్మాణం జరుగుతోందన్నారు. గుజరాత్‌లోని షిలాజ్‌ వంతెన నిర్మాణం కూడా ఇందులో భాగంగానే జరుగుతోందని ఆయన తెలిపారు.

ఇవీ చదవండి..

సీరం సంస్థలో భారీ అగ్ని ప్రమాదం

రెండో ప్రపంచయుద్ధం కంటే ఎక్కువ..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని