Nitin Gadkari: ఇది ‘బాహుబలి’ బారియర్‌.. ప్రపంచంలోనే మొదటిది!

ప్రపంచంలోనే మొదటిసారి ఓ వెదురు బారియర్‌ను మహారాష్ట్రలోని వణి- వరోరా హైవేపై ఏర్పాటు చేశారు. ఇదొక అసాధారణ విజయమని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు.

Updated : 04 Mar 2023 17:56 IST

ముంబయి: సాధారణంగా మనకు రహదారుల వెంబడి స్టీల్‌ బారియర్లు కనిపిస్తాయి. కానీ, ప్రపంచంలోనే మొట్టమొదటి వెదురు బారియర్‌(Bamboo Crash Barrier)ను మహారాష్ట్ర (Maharashtra)లోని ఓ హైవేపై ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ(Nitin Gadkari) ఈ విషయాన్ని వెల్లడించారు. చంద్రాపూర్, యావత్మాల్ జిల్లాలను కలిపే హైవేపై వణి- వరోరా పట్టణాల మధ్య 200 మీటర్ల మేర ఈ వెదురు క్రాష్ బారియర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశంతోపాటు స్థానిక వెదురు రంగాని(Bamboo Industry)కి ఇది గొప్ప విజయమని మంత్రి పేర్కొన్నారు. ఈ పర్యావరణహిత వెదురు బారియర్లు.. ఉక్కు వాటి(Steel Barriers)కి సరైన ప్రత్యామ్నాయంగా నిలుస్తాయని చెప్పారు. ఈ మేరకు శనివారం ఓ ట్వీట్‌ చేశారు.

‘వణి- వరోరా హైవేపై 200 మీటర్ల పొడవైన వెదురు క్రాష్‌ బారియర్‌ను ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిది. ఆత్మనిర్భర్‌ భారత్‌ దిశగా ఇదొక అసాధారణ విజయం’ అని గడ్కరీ పేర్కొన్నారు. ఈ వెదురు బారియర్‌కు ‘బాహుబలి’ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. నేషనల్ ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్స్(NATRAX), సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌(CBRI) వంటి ప్రభుత్వ సంస్థల్లో అనేక కఠిన పరీక్షలు నిర్వహించిన అనంతరం దీన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ గుర్తింపు కూడా పొందినట్లు తెలిపారు. ‘బాంబూసా బాల్కోవా’ వెదురు జాతితో వీటిని తయారు చేసినట్లు చెప్పారు. ఈ వెదురు బారియర్ల పునర్వినియోగం విలువ 50-70 శాతం ఉన్నట్లు మంత్రి తెలిపారు. అదే ఉక్కు బారియర్ల రీసైక్లింగ్‌ వాల్యూ 30-50 శాతం మాత్రమేనన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని