అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్‌.. చివరి దశకు..

భారతీయ రైల్వేస్‌ జమ్మూ-కశ్మీర్‌లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కలల ప్రాజెక్టు నిర్మాణం చివరి దశకు వచ్చింది. ప్రపంచంలోనే..

Published : 15 Mar 2021 22:47 IST

కశ్మీర్‌: భారతీయ రైల్వేస్‌ జమ్మూ-కశ్మీర్‌లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కలల ప్రాజెక్టు నిర్మాణం చివరి దశకు వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్‌ చీనాబ్‌ నదిపై నిర్మితమవుతోన్న విషయం తెలిసిందే. బ్రిడ్జ్‌ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకోవడంతో దేశం మరో ఘనతను సాధించినట్లైందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సోమవారం ట్వీట్‌ చేశారు. ‘ఇదో చరిత్ర, చీనాబ్‌ నదిపై నిర్మిస్తోన్న బ్రిడ్జ్‌ కింది భాగం ఆర్చ్‌ పూర్తయింది. పై భాగంలోని ఆర్చ్‌ని కూడా ఇంజినీర్లు అద్భుతంగా నిర్మిస్తున్నారు’అని ఆయన ట్వీట్‌ చేశారు. ఈ బ్రిడ్జ్‌ని అధిక వ్యయంతో అత్యంత ఎత్తులో నిర్మిస్తున్నారు. ఈ మేరకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్‌గా ఇది నిలిచిపోతుందని ఆయన చెప్పారు.  వంతెన నిర్మాణానికి సంబంధించిన ఓ వీడియోను కూడా ఆయన ట్విటర్‌లో పంచుకున్నారు.

ఇప్పటి వరకూ నిర్మాణ పనులు పూర్తి చేయడంలో ఇంజినీర్లు, కార్మికులు చాలా శ్రమించారని మంత్రి కొనియాడారు. ప్రస్తుతం బ్రిడ్జ్‌ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ వివరించింది. ఈ ప్రాజెక్టును మూడు దశల్లో పూర్తి చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. జమ్మూ కశ్మీర్‌ నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు ఈ బ్రిడ్జ్‌ ద్వారా చేరుకోవచ్చు. కొంకణ్ రైల్వే ఆధ్వర్యంలో ఉద్ధమ్‌పూర్‌-శ్రీనగర్‌-బారముల్లా రైల్వే లింక్‌ ప్రాజెక్టు కింద 111 కిలోమీటర్ల విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని