Kejriwal: నన్ను అవే ఆందోళనకు గురిచేస్తున్నాయ్‌.. కేజ్రీవాల్‌

సిసోదియా, జైన్‌  అరెస్టయి జైలులో ఉంటున్నందుకు తనకేమీ ఆందోళన లేదని దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అన్నారు. వారిద్దరూ ధైర్యవంతులని, దేశం కోసం ప్రాణాలు ఇచ్చేందుకు సైతం సిద్ధపడిన వ్యక్తులన్నారు. కానీ, దేశంలోని పరిస్థితులే తనను ఆందోళన కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. 

Published : 07 Mar 2023 23:25 IST

దిల్లీ: దేశాన్ని దోచుకుంటున్న వారు తప్పించుకొని తిరుగుతుండగా.. మంచి పనులు చేస్తున్న వారిని మాత్రం అరెస్టు చేస్తున్నారని దిల్లీ సీఎం కేజ్రీవాల్‌(Kejriwal) ఆవేదన వ్యక్తంచేశారు. హోలీ నేపథ్యంలో దేశం కోసం ప్రార్థనలు చేస్తున్నట్టు చెప్పారు. మంగళవారం డిజిటల్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన కేజ్రీవాల్‌.. కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తంచేశారు. దిల్లీలో ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు చాలా అధ్వాన్నంగా ఉండేవనేది ప్రతి ఒక్కరికీ తెలుసు.. కానీ వాటిని అత్యంత మెరుగ్గా తీర్చిదిద్దిన మనీశ్ సిసోదియా, సత్యేందర్‌ జైన్‌   అనే ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు జైలులో ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దేశం కోసం మంచి పనిచేస్తున్నవారిని జైళ్లలో పెట్టిస్తున్న ప్రధాని.. దోపిడీకి పాల్పడుతున్నవారిని మాత్రం ఆలింగనం చేసుకుంటున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.  అందువల్ల ఈ హోలీ పర్వదినాన అలాంటి విచారకరమైన పరిస్థితులు మెరుగుపడాలని ప్రార్థనలు చేస్తున్నట్టు చెప్పారు. ప్రజలకూ అలాగే అనిపిస్తే హోలీ సెలబ్రేషన్స్‌ అనంతరం ప్రార్థనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

సిసోదియా, జైన్‌  అరెస్టయి జైలులో ఉంటున్నందుకు తనకేమీ ఆందోళన లేదని కేజ్రీవాల్‌ అన్నారు. వారిద్దరూ ధైర్యవంతులని, దేశం కోసం ప్రాణాలు ఇచ్చేందుకు సైతం సిద్ధపడిన వ్యక్తున్నారు. కానీ, దేశంలోని పరిస్థితులే తనను ఆందోళన కలిగిస్తున్నాయని కేజ్రీవాల్‌ అన్నారు.  దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఫిబ్రవరి 26న మనీశ్ సిసోదియాను సీబీఐ అధికారులు అరెస్టు చేయగా.. మనీలాండరింగ్‌ కేసులో సత్యేందర్‌ జైన్‌ను ఈడీ అధికారులు గతేడాది అరెస్టు చేశారు. ఇటీవల వీరిద్దరూ తమ మంత్రి పదవులకు రాజీనామా చేయగా.. వీరి శాఖల బాధ్యతలను మరో ఇద్దరికి కేటాయించిన విషయం తెలిసిందే. ఇంకోవైపు, అరెస్టయిన సిసోదియా ప్రస్తుతం తిహాడ్‌ జైలులో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని