Parliament: మిలటరీ అవసరాల కోసం రూ.1.93 లక్షల కోట్లు: రక్షణశాఖ

భారత్‌ స్వదేశీ రక్షణ సామర్థ్యాన్ని (Defence Capacity) పెంచుకుంటోందని కేంద్రం లోక్‌సభ (Lok Sabha)కు వెల్లడించింది.  గడిచిన 5 ఏళ్లలో దాదాపు రూ.రెండు లక్షల కోట్ల మిలటరీ హార్డ్‌వేర్‌ (Military Equipment) ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నట్లు మంత్రి అజయ్‌భట్‌ (Ajay Bhatt) తెలిపారు.

Published : 03 Feb 2023 22:31 IST

దిల్లీ: గడిచిన ఐదేళ్లలో భారత రక్షణ అవసరాల దృష్ట్యా రూ.1.93లక్షల కోట్ల విలువైన మిలటరీ (Military Equipment) హార్డ్‌వేర్‌ ఉత్పత్తులను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు రక్షణశాఖ (Defence Ministry) సహాయ మంత్రి అజయ్‌భట్‌ (Ajay Bhatt)లోక్‌సభలో వెల్లడించారు. ప్రధానంగా హెలికాప్టర్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌ రాడార్లు, రాకెట్లు, గన్‌లు, రైఫిల్స్‌, క్షిపణులను కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. లోక్‌సభలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.30,677.29 కోట్లు, 2018-19 లో రూ.38, 115.60 కోట్లు, 2019-20లో రూ.40,330.02 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నట్లు లోక్‌సభకు తెలిపారు. ఆత్మనిర్భర్‌ భారత్, మేక్‌ ఇన్‌ ఇండియా విధానాలను అనుసరిస్తున్న భారత్‌ క్రమంగా స్వదేశీ రక్షణ సామర్థ్యాన్ని పెంచుకుంటూ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటోందని చెప్పారు. 

రక్షణ ఉత్పత్తుల అంశమై 2017 నుంచి డిసెంబరు 2022 వరకు వివిధ దేశాలతో 264 ఒప్పందాలు చేసుకున్నట్లు వెల్లడించిన అజయ్‌భట్‌.. దాదాపు 88 ఒప్పందాలు అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌, ఇజ్రాయిల్‌, స్పెయిన్‌ దేశాలతో జరిగినట్లు పార్లమెంట్‌కు తెలిపారు. మరోవైపు 73,942.82 కోట్లతో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ‘55 మిషన్‌ మోడ్‌’ ప్రాజెక్టుల కోసం పని చేస్తోందని భట్‌ వెల్లడించారు. న్యూక్లియర్ డిఫెన్స్ టెక్నాలజీస్, ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ (ఏఐపీ), కంబాట్ సూట్, టార్పెడో, ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్, క్రూయిజ్ క్షిపణులు, గ్యాస్ టర్బైన్ ఇంజన్, అసాల్ట్ రైఫిల్, వార్‌హెడ్‌లు, మెషీన్‌ గన్‌లు, మానవ రహిత వైమానిక వాహనాలు, అత్యాధునిక రాకెట్ల తయారీ తదితర అంశాలు వీటి పరిధిలోకి వస్తాయని చెప్పారు. భూ ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే క్షిపణులు, యాంటీ షిప్‌ క్షిపణి వ్యవస్థ, యాంటీ ఎయిర్‌ఫీల్డ్‌ క్షిపణులను కూడా డీఆర్‌డీవో అభివృద్ధి చేస్తోందని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు