Published : 21 May 2021 23:38 IST

‘అక్కడ వైద్యం కంటే చావే నయం’

కోర్టుకు వెల్లడించిన ఫాదర్ స్టాన్ స్వామి

ముంబయి: ముంబయి ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవడం కంటే చావే నయమని భీమా కోరేగావ్ కేసులో అరెస్టయిన మానవహక్కుల కార్యకర్త ఫాదర్ స్టాన్ స్వామి (83) కోర్టుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నడిచే ముంబయిలోని ఆసుపత్రిలో చికిత్స చేయించుకోనని వెల్లడించారు. నవీ ముంబయిలోని తలోజా జైలులో అండర్‌ ట్రయల్ ఖైదీగా ఫాదర్‌ స్టాన్‌ స్వామి శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో అధికారులు శుక్రవారం ఆయనను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జస్టిస్‌ ఎస్‌జే కథావాలా నేతృత్వంలోని బాంబే హైకోర్టు బెంచ్‌ ముందు హాజరుపరిచారు. గత వారం ముంబయిలోని జేజే ఆసుపత్రిలో స్టాన్ స్వామికి నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికను అధికారులు బెంచ్‌ ముందుంచారు. ఆ నివేదికను పరిశీలించిన బెంచ్‌.. స్వామి తీవ్ర వినికిడి లోపంతో బాధపడుతున్నట్లు తెలిపింది. శరీరం సహకరించడం లేదని.. ఆయన నడిచేందుకు చేతి కర్ర సాయం లేదా, వీల్‌ చైర్‌ అవసరమని వెల్లడించింది. పల్స్‌ రేటు నిలకడగానే ఉందని, వైద్యానికి సహకరిస్తున్నట్లు నివేదిక సూచిస్తోందని పేర్కొంది.

ఫాదర్‌ స్వామి బెంచ్‌తో మాట్లాడుతూ.. జైలులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. ‘ఎనిమిది నెలల క్రితం నన్ను ఇక్కడకు తీసుకొచ్చారు. ఈ జైలుకు వచ్చేముందు ఆరోగ్యంగా ఉన్నాను. కానీ జైలుకు వచ్చాక నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఎనిమిది నెలల క్రితం స్వతహాగా స్నానం చేసేవాడిని. నడకకు వెళ్లేవాడిని. నా ఆలోచనలను పుస్తకాల్లో రాసుకునేవాడిని. ఇక్కడకు వచ్చాక అనారోగ్య సమస్యలు తలెత్తుతుండటంతో వీటిని ఒక్కొక్కటిగా వీడాల్సి వచ్చింది. ఇప్పుడు నన్ను నడవలేని, స్వతహాగా రాసుకోలేని స్థితికి తీసుకొచ్చింది ఈ జైలు. నాకు ఎవరో ఒకరు స్పూన్‌తో అన్నం తినిపించాల్సిన పరిస్థితి ఎదురైంది’ అని స్వామి కోర్టుకు తన సమస్యలు నివిపించారు. రెండు సార్లు తనను జేజే ఆసుపత్రిలో చేర్పించారని, కానీ వారు అందించిన వైద్యం తన సమస్యలను నయం చేయలేదని వివరించారు. ఇంకోసారి ఆ ఆసుపత్రికి వెళ్లనని పేర్కొన్నారు. ‘నేను ఇలాగే ఇబ్బంది పడి మరణిస్తా కానీ ఇక్కడి ఆసుపత్రుల్లో చేరను. మధ్యంతర బెయిల్‌ ఇస్తే రాంచీ ఆసుపత్రిలో మిత్రుల మధ్య చికిత్స తీసుకుంటా’ అని తెలిపారు.

ఈ విచారణ ఆసుపత్రిలో చికిత్స అందించేందుకేనని, మధ్యంతర బెయిల్‌ కోసం కాదని కోర్టు స్పష్టం చేసింది. ఇవి వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలేనని పేర్కొంది. స్వామి తరఫు న్యాయవాది మిహిర్‌ దేశాయ్‌ మాట్లాడుతూ..  తన క్లయింట్‌ ఆసుపత్రిలో చేరేలా మాట్లాడి ఒప్పించేందుకు విచారణను వారంపాటు వాయిదా వేయాలని కోర్టును కోరారు. స్పందించిన కోర్టు ఆసుపత్రిలో చేరేందుకు స్వామి అంగీకరిస్తే కోర్డుకు తెలపాలని న్యాయవాదికి సూచించింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని