wrestlers Protest: పార్లమెంట్‌ వైపు దూసుకెళ్లిన రెజ్లర్ల నిర్బంధం.. దిల్లీలో ఉద్రిక్తత!

డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ రెజర్లు చేపట్టిన ఆందోళన ఆదివారం ఉద్రిక్తతలకు దారి తీసింది.

Updated : 28 May 2023 17:38 IST

దిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రెజ్లర్లు చేపట్టిన ఆందోళన ఆదివారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభోత్సవం వేళ అటు వైపు మార్చ్‌ చేపట్టిన రెజ్లర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు నిర్బంధించేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భాజపా ఎంపీ, భారత రెజ్లింగ్‌ సమాఖ్య చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ పలువురు అథ్లెట్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని.. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ దాదాపు నెల రోజులకు పైగా ప్రముఖ రెజ్లర్లు వినేశ్‌ ఫొగాట్‌, సాక్షి మాలిక్‌, బజ్‌రంగ్‌ పునియా తదితరులు ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం మహిళా సమ్మాన్‌ మహాపంచాయత్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో పోలీసులు పార్లమెంట్‌ భవనానికి రెండు కిలోమీటర్ల పరిధిలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే, జంతర్‌ మంతర్‌ వద్ద భద్రతా బలగాలను భారీగా మోహరించారు.

పోలీసులు భారీగా భద్రతా బలగాలను మోహరించినప్పటికీ రెజ్లర్లు జాతీయ జెండాలు చేతపట్టుకొని పార్లమెంట్‌ వైపు మార్చ్‌ను కొనసాగిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వినేష్‌ ఫొగాట్‌, సంగీతా ఫొగాట్‌ తదితరులు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించుకొని ముందుకు సాగేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురు అథ్లెట్లు కిందపడిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అనంతరం పోలీసులు ఆందోళనకారులందరినీ పోలీసులు నిర్బంధించారు. నిరసనకారులందరినీ నిర్బంధించి బస్సుల్లోకి ఎక్కించినట్టు దిల్లీ ప్రత్యేక కమిషనర్‌ దీపేంద్ర పాఠక్‌ వెల్లడించారు. అథ్లెట్లు శాంతి భద్రతలను ఉల్లంఘించినందుకు గాను తగిన విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, ఏప్రిల్‌ 23 నుంచి బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు కొనసాగిస్తున్న దీక్షా శిబిరాన్ని పోలీసులు తొలగించారు. 

ఖండించిన కేజ్రీవాల్‌

రెజ్లర్లను అడ్డుకొని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న వీడియోను సాక్షి మాలిక్‌ ట్విటర్‌లో షేర్‌ చేయగా.. దీనిపై దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. దేశ గౌరవాన్ని పెంచే మన క్రీడాకారులతో ఇలా ప్రవర్తించడం తప్పని.. ఇది తీవ్ర గర్హనీయమని పేర్కొన్నారు. మరోవైపు, రెజ్లర్లు చేపట్టిన నిరసనకు మద్దతుగా ఆదివారం ‘మహిళా మహాపంచాయత్‌’కు పిలుపునిచ్చిన నేపథ్యంలో  ఖంఝావాలా చోక్‌లోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్కూల్‌ను తాత్కాలిక జైలుగా ఉపయోగించుకొనేందుకు దిల్లీ మేయర్‌ను పోలీసులు అనుమతి కోరారు. పోలీసుల అభ్యర్థనను ఆమె తిరస్కరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని