Kejriwal to Modi: మోదీజీ.. అలా చేయడం పొరపాటు: కేజ్రీవాల్‌

సింగపూర్‌లో జరగబోయే ‘వరల్డ్‌ సిటీస్‌ సమ్మిట్‌’కు వెళ్లడానికి తనకు అనుమతి ఇవ్వకపోవడం పొరపాటని తెలుపుతూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు...

Published : 17 Jul 2022 14:52 IST

దిల్లీ: సింగపూర్‌లో జరగబోయే ‘వరల్డ్‌ సిటీస్‌ సమ్మిట్‌’కు వెళ్లడానికి తనకు అనుమతి ఇవ్వకపోవడం పొరపాటని తెలుపుతూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అలాంటి ఉన్నత వేదికలపై భారత్‌కు ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. మరి అలాంటి సమ్మిట్‌కు తనను వెళ్లకుండా చేయడం ఏమాత్రం సమంజసం కాదని వ్యాఖ్యానించారు.

‘‘సదస్సుకు వెళ్లడానికి కావాల్సిన అనుమతిని నిలిపివేయడం పొరపాటు. ప్రపంచ వేదికపై దిల్లీ మోడల్‌ పాలనను ప్రదర్శించడం ఓ గొప్ప అవకాశం. అలాంటి ఉన్నత స్థాయి సమావేశాలకు వెళ్లకుండా ఓ ముఖ్యమంత్రిని ఆపడం దేశ ప్రయోజనాలకే విరుద్ధం. ఇప్పటికైనా భారత్‌ తరఫున ప్రాతినిథ్యం వహించేందుకు అనుమతి ఇవ్వాలి’’ అని లేఖలో కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

సింగపూర్‌లో జరిగే ‘వరల్డ్‌ సిటీస్‌ సమ్మిట్‌’కు హాజరుకావాలని కోరుతూ సింగపూర్‌ హై కమిషనర్‌ సైమన్ వాంగ్‌.. కేజ్రీవాల్‌కు జూన్‌ 1న ఆహ్వానం పంపారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరుతూ దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వి.కె.సక్సేనాకు కేజ్రీవాల్‌ లేఖ రాశారు. కానీ, ఇప్పటి వరకు ఆయనకు ఎలాంటి సమాధానం రాలేదని సీఎం సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని