Wuhan lab: వుహాన్‌ ల్యాబ్‌లో ఎవరా ముగ్గురు..?

చైనాలోని వుహాన్‌ ల్యాబ్ విషయంలో మరో సంచలన వార్త బయటకు వచ్చింది. దీంతో వైరస్‌ ఇక్కడి

Updated : 24 May 2021 11:33 IST

* శాస్త్రవేత్తల అస్వస్థతపై వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ సంచలన కథనం 

ఇంటర్నెట్‌డెస్క్‌ : చైనాలోని వుహాన్‌ ల్యాబ్ విషయంలో మరో సంచలన వార్త బయటకు వచ్చింది. దీంతో వైరస్‌ ఇక్కడి నుంచే పుట్టుకొచ్చిందనే ప్రచారానికి మరింత బలం చేకూరింది. అమెరికా ఇంటెలిజెన్స్‌ సంస్థల నివేదికల ఆధారంగా వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఒక కథనాన్ని ప్రచురింది. ఇప్పటికే అణుశాస్త్రవేత్తల జర్నల్‌ ‘బులెటిన్‌.ఓఆర్‌జీ’లో కూడా ల్యాబ్‌ లీకేజీపై కథనం వచ్చి సంచలనం సృష్టించింది. వీటిల్లో వేటికి చైనా ఆధారాలు చూపించి ఖండించలేదు. కేవలం తమపై దుష్ప్రచారంగానే కొట్టిపారిసింది. ఇప్పుడు తాజాగా అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ఫాక్ట్‌ షీట్‌లోని విషయాలు బయటకు రావడంతో మరోసారి చైనా పాత్రను ప్రశ్నిస్తున్నాయి.

కరోనా వ్యాప్తికి ముందే శాస్త్రవేత్తలకు అస్వస్థత..

బాహ్య ప్రపంచంలో సార్స్‌కోవ్‌-2 వైరస్‌ వ్యాపించడానికి ముందే వుహాన్‌ ల్యాబ్‌లోని చాలా మంది పరిశోధకులు అస్వస్థతకు గురయ్యారు. వీరిందరిలో కొవిడ్‌19 లేదా సాధారణ ఫ్లూలో కనిపించే జ్వరం, పొడిదగ్గు వంటి లక్షణాలు ఉన్నాయి.  అమెరికా ఇంటెలిజెన్స్‌ వద్దకు ఈ సమాచారం ఒక నమ్మకమైన అంతర్జాతీయ భాగస్వామి నుంచి వచ్చింది.  అత్యంత చాతుర్యంతో చాలా కచ్చితమైన సమాచారం వెల్లడించినట్లు కొందరు అధికారులు వాల్‌స్ట్రీట్‌తో పేర్కొన్నారు. కానీ, వారు ఎందుకు జబ్బుపడ్డారో కారణం మాత్రం తెలియలేదని తెలిపారు. 

శాస్త్రవేత్తల అంచనాలకు తగ్గట్టే..

చైనాలోని వుహాన్‌లో 2019 డిసెంబర్‌ 8వ తేదీన తొలి సార్స్‌కోవ్‌-2 కేసు నమోదైంది. కానీ, చాలా మంది వైరాలజిస్టులు, అంటువ్యాధుల చికిత్స నిపుణులు మాత్రం అది 2019 నవంబర్‌లోనే వుహాన్‌లో వ్యాపించి ఉంటుందని చెబుతున్నారు. ఇన్ని ఆరోపణలు వస్తున్నా వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ వైరాలజీ మాత్రం రా డేటా, సేఫ్టీ లాగ్స్‌, గబ్బిలాల్లోని కరోనావైరస్‌లపై పరిశోధనలు చేసిన ల్యాబ్‌ రికార్డులను మాత్రం ఎవరికీ ఇవ్వడంలేదు.

గతేడాది మార్చిలో హడ్సన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో నాటి విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో మాట్లాడుతూ.. ‘‘ లెవల్‌ 3 ల్యాబ్‌లో చాలా రక్షణ ఉంటుంది. అక్కడ కరోనా వైరస్‌లపై  పనిచేస్తున్న ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరందరిలో ఇన్‌ఫ్లుయెంజా లక్షణాలు  ఉన్నాయి. వీరంతా ఒకే వారంలో తీవ్ర అస్వస్థకు గురి కావడం కానీ,  ఆసుపత్రిలో చేరి చికిత్స పొందడంగానీ జరిగింది. పరిశోధకులు జబ్బుపడటమే మొదటి క్లస్టర్‌ కావచ్చు’’ అని పేర్కొన్నారు. పాంపియో గతంలో నిఘా సంస్థ సీఐఏ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఆయన ఎంత మంది జబ్బుపడ్డారో కూడా అంకెతో సహా చెప్పారు.


అమెరికా తప్పుదోవ పట్టిస్తోంది..

ఈ కథనంపై వాల్‌స్ట్రీట్‌ చైనా విదేశాంగ శాఖను వివరణ కోరగా..  ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదికను ఉటంకిస్తూ సమాధానం చెప్పింది. ల్యాబ్‌ నుంచి లీకయ్యే అవకాశం లేదని పేర్కొంది. అమెరికా ఈ ప్రచారాన్ని రెచ్చగొట్టి తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించింది.   గతంలో కూడా చైనా ఈ వైరస్‌ తమ దేశంలో పుట్టలేదని.. బయట నుంచి వచ్చిందని ప్రచారం చేసింది. ఒక దశలో అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఉన్న ఫోర్ట్‌డెట్రిక్‌ సైనిక స్థావరంలోని ల్యాబ్‌ నుంచి వచ్చిందని కూడా ఆరోపించింది.

ఈ ఏడాది జనవరిలో వుహాన్‌ ల్యాబ్‌కు వచ్చిన నిపుణుల బృందంతో బ్యాట్‌ ఉమెన్‌గా పేరున్న షీఝెంగ్‌ లీ మాట్లాడుతూ.. ‘ తమ ల్యాబ్‌ నుంచి వైరస్‌ లీక్‌ కాలేదని తెలిపారు. తమ సభ్యుల్లో ఇప్పటికీ కరోనావైరస్‌ యాంటీబాడీలు లేవు’ అని పేర్కొన్నారు. కానీ, అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ఫ్యాక్ట్‌షీట్‌ మాత్రం షీ చెప్పిన మాటలు ఎంత వరకు నమ్మశక్యం అనే అంశంపై సందేహాలను వ్యక్తం చేసింది. ఈ ఫ్యాక్ట్‌షీట్‌లో చైనా ల్యాబ్‌ల్లో జరిగిన పలు ప్రమాదాలు, పీఎల్‌ఏతో కలిసి చేసిన పరిశోధనలను కూడా పేర్కొన్నారు. 

నిపుణుల బృందానికి నో..

ప్రపంచ ఆరోగ్య సంస్థ పంపిన నిపుణుల బృందం చైనాలో 76,000 కొవిడ్‌ కేసుల్లో 92 మంది అక్టోబర్‌-డిసెంబర్‌ మొదటి వారం మధ్యలో అస్వస్థకు గురైనట్లు గుర్తించింది. వారి డేటాను ఇవ్వాలని కోరగా చైనా తిరస్కరించింది. ఇక వుహాన్‌లోని బ్లడ్‌బ్యాంక్‌ నమూనాలు ఇవ్వాలని .. వాటిల్లో 2019 డిసెంబర్‌ కంటే ముందు నమూనాలను పరిశీలిస్తామని పేర్కొంది. కానీ, వ్యక్తుల ప్రైవసీకి భంగం కలుగుతుందని తొలుత పేర్కొంది. ఆ తర్వాత ఇచ్చేందుకు అంగీకరించినా.. ఆ నమూనాలు పరిశీలించే అవకాశం ఇప్పటి వరకూ నిపుణులకు కల్పించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని