XBB variant: ఈ వేరియంట్‌పై ‘వాట్సాప్‌’ సమాచారం తప్పు.. కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టీకరణ

ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ కేసులు భారత్‌లో వెలుగు చూసిన వేళ.. వైరస్‌ వ్యాప్తి, కట్టడిపై ప్రభుత్వం పౌరులను అప్రమత్తం చేస్తోంది. ఇదే సమయంలో దేశంలో ప్రమాదకరమైన ఎక్స్‌బీబీ వేరియంట్‌ వ్యాపిస్తోందంటూ వాట్పాప్‌లో చక్కర్లు కొడుతున్న సమాచారం నకిలీదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.  

Updated : 22 Dec 2022 17:42 IST

దిల్లీ: చైనాతోపాటు ఇతర దేశాల్లో కరోనా కొత్త వేరియంట్‌ విజృంభిస్తోన్న వేళ.. భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. చైనాలో విస్తృత వ్యాప్తికి కారణమైన బీఎఫ్‌.7 వేరియంట్‌ (Omicron) విస్తృతంగా వ్యాపిస్తోన్న నేపథ్యంలో వైరస్‌పై పర్యవేక్షణ పెంచడంతోపాటు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపట్టాలని రాష్ట్రాలకు సూచించింది. ఇలా కొవిడ్‌ వ్యాప్తిపై మరోసారి ఆందోళనలు నెలకొన్న సమయంలో.. భారత్‌లో అత్యంత ప్రమాదకరమైన ఎక్స్‌బీబీ వేరియంట్‌ (XBB Variant) వ్యాపిస్తోందనే వార్తలు వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై స్పందించిన కేంద్ర ఆరోగ్యశాఖ, అది తప్పుదోవ పట్టించే సమాచారమని స్పష్టం చేస్తూ ఓ ప్రకటన జారీ చేసింది.

‘ఒమిక్రాన్‌ (Omicron) ఉపరకమైన ఎక్స్‌బీబీ వేరియంట్‌  (XBB Variant) కొత్తగా వెలుగు చూసింది. డెల్టా వేరియంట్‌ (Delta Variant) కంటే ఐదు రెట్ల ఎక్కువ వ్యాప్తితోపాటు మరణాల రేటు కూడా అధికంగా ఉంటుంది. ఇతర వేరియంట్లతో పోలిస్తే దీని వల్ల కలిగే లక్షణాలు కూడా వేరుగా ఉంటాయి. దగ్గు, జ్వరం కాకుండా ఇతర లక్షణాలు ఉంటాయి. ఈ విషయాన్ని కుటుంబీకులు, మిత్రులకు తెలియజేయండి’ అంటూ ఓ సమాచారం వాట్సాప్‌ గ్రూపుల్లో విస్తృతంగా తిరుగుతోంది. ఈ సమాచారం నకిలీదని, తప్పుదోవపట్టించేదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

మరోవైపు ఒమిక్రాన్‌ (Omicron) కంటే ఎక్స్‌బీబీ వేరియంట్‌ ప్రమాదకరమైనది అనడానికి ఎటువంటి సమాచారం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇదివరకే పేర్కొంది. డెల్టా వేరియంట్ కంటే తక్కువ ప్రమాద తీవ్రత ఉంటుందని తెలిపింది. ఒమిక్రాన్‌ వేరియంట్లతో పోలిస్తే దీని వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ తీవ్రత మాత్రం తక్కువేనని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మెట్రిక్స్‌, ఎవాల్యూయేషన్‌ నివేదిక కూడా వెల్లడించింది. ఏదేమైనా ప్రస్తుతం చైనాలో విజృంభణకు బీఎఫ్‌.7 వేరియంట్‌ కారణమని ఈఎక్స్‌బీబీ కాదన్న విషయాన్ని గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని