Xi Jinping: ప్రపంచ కర్మాగారానికి శాశ్వత యజమానిగా జిన్‌పింగ్‌..!

ప్రపంచ కర్మాగారంగా పేరున్న చైనాపై షీ జిన్‌పింగ్‌ ఉడుం పట్టు బిగుస్తోంది. అధ్యక్షుడిగా తన పదవిని శాశ్వతం చేసుకొనే పనిలో ఆయన పూర్తిగా నిమగ్నం అయ్యారు. ఆయన జీవితంలో అత్యంత కీలకమైన చైనా కమ్యూనిస్టు

Published : 11 Nov 2021 01:24 IST

 సీసీపీ  రూపురేఖలు మార్చేసిన చైనా అధ్యక్షుడు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ప్రపంచ కర్మాగారంగా పేరున్న చైనాపై షీ జిన్‌పింగ్‌ ఉడుం పట్టు బిగిస్తున్నారు. అధ్యక్షుడిగా తన పదవిని శాశ్వతం చేసుకొనే పనిలో ఆయన పూర్తిగా నిమగ్నం అయ్యారు. ఆయన జీవితంలో అత్యంత కీలకమైన చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్లీనరీ బీజింగ్‌లోని జాంగ్జీ హోటల్‌లో సోమవారం మొదలైంది. సాధారణంగా చైనా కమ్యూనిస్టు పార్టీలోని పొలిట్‌ బ్యూరోలో రిటైర్మెంట్‌ వయస్సు 68 ఏళ్లు. ప్రస్తుతం జిన్‌పింగ్‌ ఆ వయస్సుకు చేరుకొన్నారు. దీంతో ప్రపంచం దృష్టి మొత్తం దానిపైనే ఉంది. ఆయన ప్లీనరీకి ముందే తన శత్రువులు, పోటీగావస్తారని భావించిన వారిని ఒక్కొక్కరిగా శంకరగిరి మాన్యాలు పట్టించారు. ప్రపంచంలోనే రెండో ఆర్థిక మహాశక్తి అయిన చైనాను కంటి చూపుతో శాసించే స్థాయికి చేరుకొన్నారు.

662 రోజుల నుంచి దేశం దాటకుండా..

షీజిన్‌పింగ్‌ 662 రోజుల నుంచి చైనాను దాటలేదు. జీ20 దేశాధినేతల్లో అత్యధిక కాలం స్వదేశంలో ఉన్న నేత ఆయనే. కాప్‌ 26కు కూడా హాజరుకాలేదు. వచ్చేవారం అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో భేటీ ఉన్నా అది కేవలం వర్చువల్‌గా మాత్రమే జరిగే అవకాశం ఉంది. జిన్‌పింగ్‌ చివరి సారిగా 2020 జనవరి 18వ తేదీన మయన్మార్‌లో పర్యటించారు. ఆ తర్వాత మార్చిలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను చైనాలోనే వ్యక్తిగతంగా కలిశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏ విదేశీ నేతను ఆయన వ్యక్తిగతంగా కలవలేదు. ఇప్పటికీ ఆయన 21 నెలల నుంచి పూర్తిగా చైనాకే పరిమితమైపోయారు. కొవిడ్‌ కారణంగా ఆయన బయటకు వెళ్లడం లేదన్నది కేవలం సాకు మాత్రమే. ఎందుకంటే చైనా దౌత్య ప్రతినిధులు, విదేశాంగ మంత్రులు సాధారణంగానే బయట దేశాలకు తిరుగుతూనే ఉన్నారు.

కొవిడ్‌కు ముందు జిన్‌పింగ్‌ చైనాకు దౌత్యపరంగా మంచి ఇమేజ్‌ తెచ్చేందుకు చురుగ్గా విదేశాల్లో పర్యటించారు. కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టడంలో చైనా విఫలం కావడంతో విదేశీ పర్యటనలకు వెళ్తే నిరసనలు, అక్కడి మీడియా సూటి ప్రశ్నలతో దేశీయంగా కూడా ఇమేజ్‌ దెబ్బ తింటుందని గ్రహించారు. దీంతో ఆయన, సీసీపీ  పొలిట్‌ బ్యూరో లోని కీలక నేతలు పూర్తిగా దేశీయ పర్యటనలకే పరిమితం అయ్యారు.

ఎక్కిన మెట్లనే పడగొడుతూ..

చైనా పాలనలో కమ్యూనిస్టు పార్టీదే పూర్తి ఆధిపత్యం. ప్రభుత్వం కేవలం ద్వితీయశ్రేణి వ్యవస్థగా ఉంటుంది. సీసీపీ (చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీ)లో మావో స్థాయి నేతగా కీర్తి గడించాలని జిన్‌పింగ్‌ అన్నీ తానై పాలన, పార్టీపై ఉడుంపట్టు బిగించారు. వాస్తవానికి మావో నియంతృత్వం తర్వాత ఆధునిక చైనా ఆవిష్కర్త డెంగ్‌ జావోపింగ్‌ సమష్టి నాయకత్వాన్ని ప్రోత్సహించారు.  కానీ,  1993లో అధికారం చేపట్టిన జియాంగ్‌ జెమిన్‌ వర్గీయులను షాంఘై గ్యాంగ్‌గా అభివర్ణించేవారు. పాలనలో వీరిదే పైచేయి. షాంఘై అత్యంత సంపన్న ప్రాంతం కావడంతో ఇక్కడి నేతలు ఆర్థికంగా శక్తిమంతులు.

ఇక పార్టీ అనుబంధ విభాగమైన చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ యూత్‌ లీగ్‌(సీసీవైఎల్‌) మరో ప్రధాన వర్గం. దేశ గ్రామీణ వర్గాలకు ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది.  షీ జిన్‌పింగ్‌ కంటే ముందు దేశ అధ్యక్షుడిగా ఉన్న హూ జింటావో ఈ వర్గానికి చెందిన వారే. గ్రామీణులను ఆకర్షించే  నిర్ణయాలు హూ పాలనలో ఉన్నాయి. హూ పాలన సమయంలోనే షాంఘై గ్యాంగ్‌, సీసీఎల్‌వై వర్గాల మధ్య అధికార పంపిణీకి మంచి అవగాహన ఏర్పడింది. ఈ క్రమంలోనే షాంఘై గ్యాంగ్‌కు చెందిన వ్యక్తిగా ముద్రపడిన షీ జిన్‌పింగ్‌ చేతికి అధ్యక్ష పగ్గాలొచ్చాయి. ఉత్సవ విగ్రహం వంటి ప్రీమియర్‌ పదవి సీసీవైఎల్‌ నేత లీ కెక్వియాంగ్‌కు దక్కింది.

షీ అధికారం చేపట్టిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో సీసీవైఎల్‌  పట్టు సడలి.. తన వ్యక్తిగత పరపతి పెరిగేలా కార్యక్రమాలు చేపట్టారు. గత ఎనిమిదేళ్లలో 241 బిలియన్‌ డాలర్లను వెచ్చించారు. దాదాపు 10 కోట్ల మందిని దారిద్ర్య రేఖ ఎగువకు తీసుకొచ్చినట్లు ఇటీవల జిన్‌పింగ్‌ ఘనంగా ప్రకటించారు. ఇది గ్రామాల్లో షీ ఇమేజ్‌ను పెంచింది.

తన వర్గీయులకే పదవులు..

మరోవైపు జిన్‌పింగ్‌  అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే  సీసీవైఎల్‌ బడ్జెట్‌ను సగానికి కుదించేశారు. దీంతో ఆ సంస్థ ఆర్థిక వనరులకు కటకటలాడింది. అదే సమయంలో బీజింగ్‌, గ్వాగ్‌ఝూ, షెన్‌జెన్‌ ప్రావిన్షియల్‌ పార్టీ సెక్రటరీ పదవులను తన అనుచరులకు కట్టబెట్టారు. బీజింగ్‌, షెన్‌జెన్‌, షాంఘై, ఛాంగ్‌క్వింగ్‌, గ్వాంగ్‌ఝూ, తియన్జిన్‌ నగరాలు పూర్తిగా జిన్‌పింగ్‌ వర్గం పాలనలో ఉన్నాయి.

షీ జిన్‌పింగ్‌ వర్గంగా ముద్రపడి డిప్యూటీ ప్రావిన్షియల్‌ స్థాయిని దాటి ఎదిగిన నాయకులు సింగ్వా విశ్వవిద్యాలయం, షాంక్సీ, హుబే, ఫుజియాన్‌, ఝెన్‌జియాంగ్‌, షాంఘై ప్రాంతాలకు చెందిన వారై ఉంటున్నారు. వీరంతా జిన్‌పింగ్‌ రాజకీయ ప్రస్థానంలో ఏదో ఒక దశలో ఆయనతో కలిసి పనిచేశారు.

జిన్‌పింగ్ తొలిసారి పగ్గాలు చేపట్టిన సమయంలో ఏర్పాటైన 18వ పొలిట్‌ బ్యూరోలోని 25 మంది సభ్యుల్లో ఐదుగురు మాత్రమే ఆయన అనుచరులు ఉన్నారు. అదే రెండోసారి అధికారం చేపట్టే సమయంలో ఏర్పాటైన 19వ పొలిట్‌ బ్యూరోలో షీ వర్గం సంఖ్య 15కు చేరింది. షాంఘై వర్గం, సీసీవైఎల్‌ను ఆయన పూర్తిగా పక్కన పెట్టారు.

జియాంగ్‌ జెమిన్‌ వర్గంపై కొరడా..

చైనా కుబేరుల్లో ఒకరైన అలీబాబా గ్రూప్‌ అధినేత జాక్‌ మా హఠాత్తుగా అదృశ్యం కావడం వెనుక షీజిన్‌పింగ్‌ హస్తం ఉంది. జాక్‌మా బిజినెస్‌ టైకూన్‌గా మారటంలో చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్‌ జెమిన్‌ పాత్ర చాలా ఉంది. జెమిన్‌ మనవడు ఆల్విన్‌ జియాంగ్‌ (జియాంగ్‌ ఝిఛాంగ్‌) ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ బోయు క్యాపిటల్‌ అనుబంధ సంస్థల ద్వారా ‘యాంట్‌’లో భారీగా పెట్టుబడులు పెట్టారు. జియాంగ్‌ వర్గానికి చెందిన జియా క్వింగ్‌లిన్‌ అల్లుడు కూడా దీనిలో  పెట్టుబడి పెట్టారు. సరిగ్గా యాంట్‌ ఐపీవోకు ముందు జాక్‌మా చైనా బ్యాంకింగ్‌ వ్యవస్థను బహిరంగంగా కించపర్చడం జిన్‌పింగ్‌కు ఊహించని అవకాశాన్ని సృష్టించింది. దీంతో వారిని ఆర్థికంగా దెబ్బతీయడానికి  జిన్‌పింగ్‌ స్వయంగా అధికారులను పురమాయించి ఐపీవోను ఆపించినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వరుస కథనాల్లో వెలుగులోకి తెచ్చింది. భారీ టెక్‌ కంపెనీలు, ఆన్‌లైన్‌ విద్యా సంస్థలు, రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజాలు ఇలా.. ఏవి తన శక్తిని ప్రశ్నిస్తాయని అనుమానం వచ్చినా.. మరో ఆలోచన లేకుండా పక్కన పెట్టారు.

అవినీతి మరకలు అంటించి..

జిన్‌పింగ్‌ అధికారం చేపట్టగానే ‘టైగర్స్‌ అండ్‌ ఫ్లైస్‌’ అవినీతి వ్యతిరేక యుద్ధం పేరిట మూడు లక్షల మందిని జైళ్లలోకి నెట్టారు. ఇలాంటి వారిలో దేశ సంపన్నుడు ఝు మింగ్‌ కూడా ఒకరు. ఆయన మూడేళ్లు జైలు జీవితం గడిపి అక్కడే ప్రాణాలు వదిలారు. గతేడాది జిన్‌పింగ్‌ను విమర్శించిన కారణంగా రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి రెన్‌ జియాక్వింగ్‌ 18 ఏళ్ల జైలు శిక్షకు గురయ్యాడు. కొవిడ్‌ సమయంలో ప్రపంచం మొత్తం చైనా వైపు చూస్తుండగానే ఈ తతంగం జరిగింది.

ప్రభుత్వ పత్రికలతో అనుకూల ప్రచారం..

కేంద్ర కమిటీ సమావేశానికి ముందే జిన్‌పింగ్‌ విజయాలను ఊదరగొడుతూ ప్రభుత్వ పత్రికలు కథనాలను వెలువరించాయి. అంతేకాదు.. ఈ సారి సమావేశంలో ప్రస్తావించే తీర్మానంలో ఇప్పటి వరకు కమ్యూనిస్టు పార్టీ ఏ రకంగా విజయం సాధించింది.. భవిష్యత్తులో దానిని ఎలా కొనసాగించాలనే దానికి సమాధానం చెప్పేలా తీర్మానం ఉండవచ్చని పేర్కొంటున్నాయి. ఇలాంటి తీర్మానాలే 1945(మావో అధికారాలు బలోపేతం చేయడానికి), 1981(డెంగ్‌షావో పింగ్‌ సమయంలో ఆర్థిక వ్యవస్థను పెట్టుబడుల కోసం తెరిచేందుకు) సమయంలో కూడా తీసుకొచ్చినట్లు పేర్కొన్నాయి. మావో, డెంగ్‌లతో సమానంగా చైనాను బలోపేతం చేసిన వ్యక్తిగా షీ జిన్‌పింగ్‌కు ప్రాముఖ్యం ఇవ్వనున్నారు. జిన్‌పింగ్‌ కంటే ముందు పార్టీ అధ్యక్షులుగా చేసిన జియాంగ్‌ జెమిన్‌, హుజింటావోల పేర్లను తీర్మానంలో ప్రస్తావించినా.. వారి విజయాలను పార్టీ చరిత్రతో అనుసంధానించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని