Yamuna River: ప్రమాదకర స్థాయిలో యమునా నది ప్రవాహం

దేశ రాజధాని నగరం నడిబొడ్డునుంచి వెళ్లే యమునా నది (Yamuna River) ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు నదిలోకి వర్షపు నీరు భారీగా వచ్చి చేరుతోంది.

Published : 13 Aug 2022 00:22 IST

దిల్లీలో లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు

దిల్లీ: దేశ రాజధాని నగరం నడిబొడ్డునుంచి వెళ్లే యమునా నది (Yamuna River) ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు నదిలోకి వర్షపు నీరు భారీగా వచ్చి చేరుతోంది. ముఖ్యంగా హరియాణాలోని యమునా నగర్‌ బ్యారేజీ (Hathni Kund Barrage) వద్ద లక్ష్య క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. దీంతో దిల్లీ సమీపంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

యమునా నది ప్రవాహం శనివారం ఉదయానికి గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చని దిల్లీ (Delhi) నీటి పర్యవేక్షణ అధికారులు ముందస్తుగా అంచనా వేశారు. కానీ, శుక్రవారం సాయంత్రానికి నదీ ప్రవాహం గరిష్ఠ స్థాయి (205.33) దాటి 205.38మీటర్లకు పెరిగింది. దీంతో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు.. వరద ముప్పు పొంచివున్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమయ్యారు. ఆయా ప్రాంతాల్లోని అధికారులు అప్రమత్తంగా ఉంటూ.. సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. నదీ ప్రవాహం 206 మీటర్ల మార్కును దాటగానే ప్రజలను తాత్కాలిక వసతి గృహాలకు తరలిస్తామని అధికారులు పేర్కొన్నారు.

హరియాణాలోని హత్నీకుండ్‌ బ్యారేజీ (Hathni Kund Barrage) వద్ద సాధారణంగా 352 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. అయితే, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో కురుస్తున్న వర్షాలకు నదిలోకి భారీగా వరద నీరు వస్తోంది. అది అక్కడ నుంచి దిల్లీకి చేరేసరికి రెండు, మూడు రోజులు పడుతుంది. దీంతో ఆగస్టు 14, 15 తేదీల్లో వరద తీవ్రత మరింత ఎక్కువగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది జులై 30న ఓల్డ్‌ రైల్వే బ్రిడ్జి వద్ద 205.59 మీటర్ల స్థాయిలో ప్రవహించింది. అంతకుముందు 2019లోనూ 206.60 మీటర్ల మార్కును చేరి ప్రమాదకర స్థాయిలో ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. 1978లో అత్యధికంగా 207.49 మీటర్ల రికార్డుస్థాయిలో ప్రవహించగా.. 2013లో 207.32 మీటర్ల స్థాయిలో యమునా నది ఉద్ధృతి కొనసాగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని