Yasin Malik: ఉగ్రవాదులకు నిధుల కేసు.. యాసిన్‌ మాలిక్‌కు జీవితఖైదు

ఉగ్రవాదులు, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌కు జీవితఖైదు పడింది.

Updated : 25 May 2022 19:54 IST

దిల్లీ: ఉగ్రవాదులు, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌కు జీవితఖైదు పడింది. ఇప్పటికే ఈ కేసులో దోషిగా తేల్చిన పటియాలా హౌస్‌ ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. యాసిన్‌ మాలిక్‌ ఇటీవల తన నేరాన్ని అంగీకరించడంతో ఎన్‌ఐఏ కోర్టు అతడిని దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో మరణశిక్ష విధించాలని ఎన్‌ఐఏ వాదించినప్పటికీ.. కోర్టు మాత్రం జీవితఖైదుకే మొగ్గుచూపింది.

అంతకుముందు ఎన్‌ఐఏ కోర్టులో వాదనల సందర్భంగా మాట్లాడిన యాసిన్‌ మాలిక్‌.. గడిచిన 28ఏళ్లలో జరిగిన హింస, ఉగ్రవాద కార్యకలాపాల్లో తన పాత్ర ఉందని నిఘా సంస్థలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకోవడమే కాకుండా మరణశిక్షకు అంగీకరిస్తానని పేర్కొన్నట్లు సమాచారం. అయితే, ఎన్‌ఐఏ మాత్రం ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చినందుకు అతనికి మరణశిక్ష విధించాలని డిమాండ్‌ చేసింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం చివరకు వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌కు జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. ఇక తీర్పు నేపథ్యంలో శ్రీనగర్‌లో ముందస్తుగానే పోలీసులు భారీ బందోబస్త్‌ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా యాసిన్‌ మాలిక్‌ నివాసం సమీపంలో డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ చేపట్టారు. అయితే, తీర్పు వెలువడుతోన్న సమయంలో యాసిన్‌ మాలిక్‌ మద్దతుదారులు కశ్మీర్‌లో నిరనలు చేపట్టారు.

ఇదిలాఉంటే, కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదం, వేర్పాటువాద కార్యకలాపాలకు సంబంధించిన కేసులో మాలిక్‌పై 2017లో ఎన్‌ఐఏ కోర్టు కేసు నమోదు చేసింది. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద, చట్టవ్యతిరేక కార్యకలాపాల కోసం మాలిక్‌.. ‘ఫ్రీడమ్‌ స్ట్రగుల్‌’ పేరుతో నిధుల సమకూర్చాడని దర్యాప్తులో తేలింది. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఓ ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో అతడిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. మాలిక్‌తో పాటు పలువురు కశ్మీరీ వేర్పాటువాద నేతలపై కూడా అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ చీఫ్‌ సయ్యద్‌ సలాహుద్దీన్‌లపై కూడా ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని