Ramdev Baba: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. రాందేవ్‌ బాబా క్షమాపణలు

దుస్తులు ధరించకపోయినా మహిళలు అందంగా ఉంటారంటూ యోగా గురువు రాందేవ్‌ బాబా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో ఆయన క్షమాపణలు తెలిపారు.

Published : 28 Nov 2022 11:52 IST

ముంబయి: మహిళల వస్త్రధారణపై ప్రముఖ యోగా గురువు రాందేవ్‌ బాబా (Ramdev Baba) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తోన్న నేపథ్యంలో ఆ వ్యాఖ్యలపై రాందేవ్‌ క్షమాపణలు తెలిపారు. మహిళలను కించపర్చాలన్న ఉద్దేశం తనకు లేదని, తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడినట్లయితే అందుకు తనను క్షమించాలని కోరారు.

దుస్తులు ధరించకపోయినా మహిళలు అందంగానే ఉంటారంటూ గతవారం రాందేవ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన మహారాష్ట్ర మహిళా కమిషన్‌ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు స్పందించిన రాందేవ్‌ బాబా.. తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు తెలియజేసినట్లు మహారాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైరపర్సన్‌ రూపాలీ చకాంకర్‌ ట్విటర్‌లో వెల్లడించారు. రాందేవ్‌ క్షమాపణ లేఖను కూడా పోస్ట్ చేశారు.

‘‘మహిళలు ఈ సమాజంలో గౌరవప్రదమైన స్థానం పొందాలనే ఉద్దేశంతో వారి సాధికారత కోసమే నేను ఎల్లప్పుడూ కృషి చేస్తాను. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘బేటీ బచావో - బేటీ పడావో’ కార్యక్రమాలను నేను ప్రోత్సహిస్తాను. మహిళలను అగౌరవపర్చాలన్న ఉద్దేశం నాకు లేదు. సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోన్న వీడియో క్లిప్‌ పూర్తిగా వాస్తవం కాదు. అయినప్పటికీ.. ఎవరైనా బాధపడినట్లయితే నేను తీవ్రంగా చింతిస్తున్నా. నా వ్యాఖ్యల వల్ల బాధపడిన వారికి బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నా’’ అని రాందేవ్‌ బాబా ఆ నోటీసులకు సమాధానమిచ్చారు.

అసలేం జరిగిందంటే..

గత శుక్రవారం మహారాష్ట్రలోని ఠానే నగరంలో పతంజలి యోగా పీఠ్‌, ముంబయి మహిళా పతంజలి యోగా సమితి సంయుక్తంగా యోగా సైన్స్‌ శిబిరాన్ని నిర్వహించాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ భార్య అమృతా ఫడణవీస్‌ సహా పలువురు మహిళలు దానికి హాజరయ్యారు. యోగా శిక్షణ కార్యక్రమం ముగిసిన వెంటనే అక్కడ ఓ ప్రత్యేక సమావేశం జరిగింది. దీంతో యోగా దుస్తుల్లో వచ్చిన మహిళలకు.. వాటిని మార్చుకొని, చీరల వంటివి ధరించేందుకు సమయం దొరకలేదు. ఆ పరిస్థితిపై స్పందించిన రామ్‌దేవ్‌..  స్త్రీలు చీరల్లో, సల్వార్‌ సూట్‌లలో అందంగా ఉంటారని.. తనలాగా అసలేం ధరించకపోయినా బాగుంటారని నోరు జారారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని