భాజపాపై ఆర్‌ఎస్‌ఎస్‌ గుర్రు.. భాగవత్‌తో భేటీ కానున్న యోగి..!

లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారి ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్‌ భాగవత్‌తో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సమావేశం కానున్నారు. 

Published : 14 Jun 2024 15:52 IST

దిల్లీ: ‘‘నిజమైన సేవకుడు అహంకారం కలిగిఉండడు. ఇతరులకు ఎలాంటి హాని కలిగించకుండా పని చేస్తాడు’’ అంటూ ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భాగవత్ (Mohan Bhagwat) వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఈ తరుణంలో ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌(Yogi Adityanath), భాగవత్(Mohan Bhagwat)ల మధ్య భేటీ జరగనున్నట్లు వార్తలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. జూన్ 15న ఆయనతో యోగి సమావేశం కానున్నారు. వారి మధ్య లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ విస్తరణతో పాటు పలు అంశాలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.

లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో భాజపా ఆశించిన స్థాయి విజయం సాధించలేక.. 240 సీట్లకే పరిమితమైంది. అత్యంత కీలక రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో షాక్‌ తగిలింది. 80 స్థానాలకుగానూ 33 సీట్లనే సొంతం చేసుకుంది. 2019లో ఆ సంఖ్య 62గా ఉంది. విపక్ష ‘ఇండియా’ కూటమి 43 చోట్ల గెలుపొందింది. ఈ ఫలితాల అనంతరం ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌లో ఒక వ్యాసం ప్రచురితమైంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు భాజపా కార్యకర్తల అతి విశ్వాసాన్ని కళ్లకు కట్టాయని, వారితోపాటు నేతలంతా ‘గాలి బుడగ’ను నమ్ముకుని పని చేశారని, మోదీపైనే ఆధారపడ్డారని, వీధుల్లో ప్రజల గొంతుకలను వినలేదని ఆ వ్యాసం పేర్కొంది.

‘‘ప్రధాని మోదీ పిలుపునిచ్చిన 400కుపైగా సీట్ల లక్ష్యం తమది కాదని భాజపా నేతలు, కార్యకర్తలు భావించారు. ఆయనవల్లే గెలుస్తామనే నమ్మకంతో వారు పని చేయలేదు. స్థానిక నాయకులను తక్కువ చేసి చూడటం, పార్టీ ఫిరాయించిన వారికి టికెట్లు ఇవ్వడం, బాగా పనిచేసిన పార్లమెంటు సభ్యులకు టికెట్లు ఇవ్వకపోవడం వికటించింది. మహారాష్ట్రలో పార్టీలను చీల్చడం వంటి అనవసర రాజకీయం కూడా దెబ్బతీసింది’’ అని అభిప్రాయం వ్యక్తంచేసింది.

అందుకే రెండు కూటములు అక్కడే ఆగిపోయాయి..

‘‘భక్తి చూపి, తర్వాత అహంకారం పెంచుకున్న పార్టీ 240 దగ్గర ఆగిపోయింది. రాముడిని వ్యతిరేకించినవారు 234 వద్ద ఆగిపోయారు’’ అంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త ఇంద్రేశ్‌కుమార్ వ్యాఖ్యానించారు. భాజపా, విపక్ష కూటములు సాధించిన ఫలితాలను ఉద్దేశించి ఈ మాట అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని