Priyanka Gandhi: ‘కేంద్రం వైఖరి.. నైతిక దివాలాకోరుతనానికి సూచన’

ప్రణాళిక ప్రకారమే లఖింపుర్‌ ఖేరీ ఘటన జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాను తక్షణమే పదవి నుంచి తొలగించాలంటూ ప్రతిపక్షాలు తమ స్వరాన్ని పెంచాయి...

Published : 16 Dec 2021 14:02 IST

దిల్లీ: ప్రణాళిక ప్రకారమే లఖింపుర్‌ ఖేరీ ఘటన జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాను తక్షణమే పదవి నుంచి తొలగించాలంటూ ప్రతిపక్షాలు తమ స్వరాన్ని పెంచాయి. రైతు వ్యతిరేక మనస్తత్వం కలిగినందునే ప్రధాని మోదీ.. ఆయన్ను తొలగించడం లేదని ఇటీవల ఆరోపించిన కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ.. తాజాగా మరోసారి ట్విటర్‌ వేదికగా ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మిశ్రాను పదవినుంచి తొలగించేందుకు ప్రభుత్వం నిరాకరించడం.. దాని నైతిక దివాలాకోరుతనానికి స్పష్టమైన సూచనని ధ్వజమెత్తారు.

‘క్రిమినల్‌ను రక్షిస్తున్నారనే వాస్తవాన్ని మార్చలేవు’

దైవభక్తి అనే కళ్లద్దాలు, మతపరమైన వస్త్రధారణ అనేవి.. ప్రధాని నరేంద్ర మోదీ ఓ క్రిమినల్‌ను రక్షిస్తున్నారనే వాస్తవాన్ని మార్చలేవు అని ప్రియాంక ట్విటర్‌లో రాసుకొచ్చారు. అజయ్ మిశ్రాను వెంటనే కేబినెట్‌ నుంచి తొలగించి.. చట్టప్రకారం అభియోగాలు మోపాలంటూ గురువారం వరుస ట్వీట్లు చేశారు. ఇదే విషయమై పార్లమెంట్‌ ఉభయ సభలూ గురువారం దద్దరిల్లిన విషయం తెలిసిందే. అజయ్‌ మిశ్రాను పదవి నుంచి తొలగించాలంటూ విపక్ష సభ్యులు లోక్‌సభలో ఆందోళనకు దిగారు. మిశ్రాను క్రిమినల్‌గా అభివర్ణిస్తూ.. వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కూడా డిమాండ్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని