Supreme Court: ‘మొత్తం దిల్లీ గొంతు నొక్కారు’.. రైతులపై సుప్రీం ఆగ్రహం

దేశ రాజధాని దిల్లీ నడిబొడ్డున ఉన్న జంతర్‌మంతర్‌ వద్ద సత్యాగ్రహం చేయడానికి అనుమతి ఇవ్వాలన్న రైతు సంఘం అభ్యర్థనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Updated : 01 Oct 2021 19:01 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ నడిబొడ్డున ఉన్న జంతర్‌మంతర్‌ వద్ద సత్యాగ్రహం చేయడానికి అనుమతి ఇవ్వాలన్న రైతు సంఘం అభ్యర్థనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘మీరు మొత్తం దిల్లీ గొంతు నొక్కేశారు. ఇప్పుడు నగరం లోపలికి వచ్చి ఇక్కడ కూడా ఆందోళన చేయాలనుకుంటున్నారు’’ అని న్యాయస్థానం మండిపడింది.

కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న ‘కిసాన్‌ మహాపంచాయత్‌’ సంఘం.. దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద సత్యాగ్రహ్‌ పేరుతో శాంతియుతంగా నిరసన చేపట్టాలని నిర్ణయించింది. అయితే ఇందుకు దిల్లీ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో ఈ సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కనీసం 200 మంది రైతులతో జంతర్‌మంతర్‌ వద్ద నిరసన చేపట్టేందుకు స్థలం కేటాయించేలా అధికారులకు ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించింది.

అయితే ఈ అభ్యర్థనపై జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌, సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘‘మీరు మొత్తం దిల్లీ గొంతు నొక్కారు. ఇప్పుడు నగరంలోకి రావాలని చూస్తున్నారు. మీ చుట్టూ స్థానికులున్నారు. మీ ఆందోళనలతో వారు ఆనందంగా ఉన్నారా? నగరంలో స్వేచ్ఛగా తిరిగే హక్కు ఇక్కడి ప్రజలకు ఉంటుంది. మీ నిరసనల్లో వారి ఆస్తులు కూడా ధ్వంసమవుతున్నాయి. హైవేలను నిర్బంధించి శాంతియుతంగా ఆందోళన చేస్తున్నామని చెబుతున్నారు. రక్షణ సిబ్బందిని కూడా అడ్డుకుంటున్నారు’’ అని ధర్మాసనం మండిపడింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా న్యాయవ్యవస్థను ఆశ్రయించినప్పుడు.. ఈ వ్యవస్థపై నమ్మకం ఉంచాలని సూచించింది.

అయితే తాము హైవేలను నిర్బంధించలేదని, పోలీసులే తమను అక్కడ అడ్డుకున్నారని కిసాన్‌ మహాపంచాయత్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో స్పందించిన ధర్మాసనం.. ‘‘దిల్లీ సరిహద్దుల్లో జరుగుతోన్న రైతు ఉద్యమంలో మేం భాగం కాదంటూ అఫిడవిట్‌ దాఖలు చేయండి’’ అని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబరు 4వ తేదీకి వాయిదా వేసింది.

దిల్లీ శివారుల్లో రైతుల ఆందోళనపై సుప్రీంకోర్టు నిన్న కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి గానీ.. ఇలా ఎంతకాలం పాటు రహదారులను నిర్బంధిస్తారని ప్రశ్నించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని