Amruta Fadnavis: ‘ఏక్‌నాథ్‌ శిందేను ట్రాప్‌ చేయాలన్నది మీరేగా’: అమృతా ఫడణవీస్‌కు బుకీ మెసేజ్‌..!

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ సతీమణి అమృత (Amruta Fadnavis)ను క్రికెట్‌ బుకీ అనిల్‌ జైసింఘానీ ఎలా బ్లాక్‌మెయిల్‌ చేశాడో పోలీసులు తమ ఛార్జ్‌షీట్‌లో వెల్లడించారు. ఒకానొక సమయంలో ‘మహా వికాస్‌ అఘాడీని కూల్చాలని చెప్పింది మీరే. అందుకు సాక్ష్యాలున్నాయి’ అని అతడు బెదిరించినట్లు తెలుస్తోంది.

Updated : 09 Jun 2023 16:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ సతీమణి అమృత (Amruta Fadnavis)ను డబ్బు కోసం బ్లాక్‌మెయిల్‌ చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన క్రికెట్‌ బుకీ అనిల్‌ జైసింఘానీ (Anil Jaisinghani)ని అమృతా ఫడణవీస్‌ సాయంతోనే పట్టుకున్నట్లు పోలీసులు తమ ఛార్జ్‌షీట్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందు అనిల్‌ ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ పంపించిన మెసేజ్‌లను కూడా పోలీసులు ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించారు. ‘ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ కూటమిని కూల్చింది మీరే’నంటూ ఆ బుకీ అమృతకు మెసేజ్‌ చేసి బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

అమృతా ఫడణవీస్‌ను బెదిరించి, బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేసిన కేసులో అనిల్ జైసింఘానీ, ఆయన కుమార్తె అనిక్ష (Aniksha Jaisinghani)పై పోలీసులు ఈ ఏడాది మార్చిలో అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ముంబయి పోలీసులు ఇటీవల 793 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. ఇందులో ఫిబ్రవరి 20న అనిల్‌పై కేసు నమోదు చేయడానికి ఒక రోజు ముందు అతడు అమృతకు పంపిన మెసేజ్‌లను కూడా జత చేశారు.

‘‘మహా వికాస్‌ అఘాడీ కూటమి ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఏక్‌నాథ్‌ శిందే, అనిల్‌ పరాబ్‌ను ట్రాప్‌ చేయాలని గత శివరాత్రి (మార్చి 1, 2022) రోజును మీరు మీ వాళ్లకు చెప్పారు. అందుకు సంబంధించిన అన్ని రికార్డులు, ఆధారాలు నా వద్ద ఉన్నాయి. నేను పంపిన వీడియోలన్నీ నిజమైనవే. అవన్నీ తప్పుడు వీడియోలైతే..! అని మీరు అనొచ్చు. కానీ, మీరో విషయాన్ని గుర్తుంచుకోవాలి. కెమెరాలు ఎప్పుడూ అబద్ధాలు చెప్పవు. నేను నార్కో పరీక్షలకైనా సిద్ధమే. మరి మీరు?’’ అని అనిల్‌ జైసింఘానీ అమృత్‌కు సందేశం పంపినట్లు పోలీసులు ఆ ఛార్జ్‌షీట్‌లో పేర్కొ్న్నారు. దీనికి అమృత (Amruta Fadnavis) బదులిస్తూ.. ‘‘ఏంటీ డబ్బు..? మీకు తెలియని వ్యక్తితో ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు?’’ అని బుకీకి అడిగినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: ఆ క్రికెట్‌ బుకీని అమృతా ఫడణవీస్‌ పట్టించారిలా..!

కాగా.. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అనిల్‌ జైసింఘానీ (Anil Jaisinghani)ని పట్టుకునేందుకు అమృతా ఫడణవీస్‌ సాయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనిల్‌పై కేసు నమోదు చేసిన తర్వాత.. అమృత అతడితో నిరంతరం టచ్‌లోని ఉన్నారని, దీంతో అతడి లొకేషన్ పట్టుకోగలిగామని పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. తమ సూచనలో మేరకే అమృత అతడికి మెసేజ్‌లు పంపినట్లు తెలిపారు.

ఏంటీ కేసు..

తానొక డిజైనర్‌నంటూ అమృతా ఫడణవీస్‌తో పరిచయం చేసుకున్న అనిక్ష తరచూ ఆమె ఇంటికి వెళ్లేది. అలా ఓ సారి తన తండ్రి గురించి అమృతకు చెప్పింది. బుకీస్‌ గురించి తన తండ్రి పోలీసులకు సమాచారం ఇస్తాడని, దాంతో ఎలా డబ్బు సంపాదించవచ్చో చెప్పింది. దీంతో అమృత ఆమెను దూరం పెట్టింది. ఆ తర్వాత నుంచి అనిక్ష.. అమృతను బెదిరించడం మొదలుపెట్టింది. తన తండ్రిని కేసుల నుంచి బయటపడేందుకు సాయం చేయాలని, లేదంటే పరువు తీస్తానని బెదిరించింది. అమృతకు డబ్బు ఉన్న బ్యాగును ఇస్తున్నట్లు నకిలీ ఆడియో, వీడియో క్లిప్పులు సృష్టించి గుర్తుతెలియని ఫోన్‌ నంబర్ల ద్వారా బ్లాక్‌మెయిల్‌ చేసింది. దీంతో అమృత పోలీసులను ఆశ్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని