Sex Change Surgery: మత్తుమందు ఇచ్చి అబ్బాయిని అమ్మాయిగా మార్చి.. ఓ యువకుడి భయానక ప్రేమ

Sex Change Surgery: ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న ఓ యువకుడు కళ్లు తెరిచి చూసేసరికి అమ్మాయిగా మారిపోయాడు. వైద్యులతో కలిసి మరో యువకుడు అతడికి మోసపూరితంగా లింగమార్పిడి చేయించాడు. యూపీలో జరిగిందీ ఘోరం.

Published : 20 Jun 2024 15:23 IST

ముజఫర్‌నగర్‌ (ఉత్తరప్రదేశ్‌): ఇష్టపడిన వ్యక్తి కోసం ఎంతకైనా తెగించడం.. అవతలి మనిషికి ఇష్టం లేకపోయినా బలవంతంగా వారిని సొంతం చేసుకోవడం.. ఇలాంటి సినిమాటిక్‌ ప్రేమకథలు తరచూ వింటూనే ఉంటాం. కానీ, అంతకుమించి ప్రవర్తించాడో ఉన్మాది. తనకు నచ్చిన యువకుడిని పెళ్లి చేసుకోవడం కోసం ఏకంగా అతడికి లింగ మార్పిడి శస్త్రచికిత్స (Sex Change Surgery) చేయించాడు. అది కూడా అతడికి ఏమాత్రం తెలియకుండా మత్తుమందు ఇప్పించి అమ్మాయిగా మార్చేశాడు. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని ముజఫుర్‌నగర్‌లో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ముజఫర్‌నగర్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడికి ఓంప్రకాశ్ అనే వ్యక్తి రెండేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నాడు. ఇటీవల ఆ యువకుడు అనారోగ్యానికి గురవడంతో మెడికల్‌ చెకప్‌ చేయిస్తానంటూ ఓంప్రకాశ్‌ జూన్‌ 3న మన్సూర్‌పుర్‌లోని బేగ్‌రాజ్‌పుర్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ యువకుడిని పరీక్షించిన వైద్యులు చిన్న సర్జరీ చేయాలని సూచించారు. అనంతరం అతడికి మత్తుమందు ఇచ్చి వ్యక్తిగత అవయవాలను తొలగించి లింగమార్పిడి శస్త్రచికిత్స చేశారు. వైద్యులతో కలిసి ప్రకాశ్‌ నాటకమాడి ఈ తతంగమంతా నడిపినట్లు తెలిసింది.

అభిమానిని చంపి.. భార్య ఫ్లాట్‌లో పూజలు: నటుడు దర్శన్‌ నిర్వాకం

‘‘ఆసుపత్రికి తీసుకొచ్చిన మరుసటి రోజు నాకు ఆపరేషన్‌ చేశారు. స్పృహలోకి రాగానే నేను అమ్మాయిగా మారిపోయానని చెప్పారు. అప్పుడు ఓంప్రకాశ్ అక్కడికి వచ్చి తానే ఇదంతా చేయించానని అన్నాడు. ఇక నేను జీవితాంతం తనతోనే ఉండొచ్చని చెప్పాడు. పెళ్లి కోసం ఏర్పాట్లు కూడా చేశానన్నాడు. ఇందుకు అంగీకరించకపోతే నా తండ్రిని చంపేస్తానని బెదిరించాడు. మా భూమిని కూడా లాక్కొన్నాడు’’ అని బాధిత యువకుడు ఆవేదన వ్యక్తంచేశాడు.

ఎలాగో ధైర్యం చేసి కుటుంబసభ్యులకు విషయం చెప్పడంతో బాధితుడి తండ్రి జూన్‌ 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఓంప్రకాశ్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారం రేపింది. భారతీయ కిసాన్‌ యూనియన్‌ సభ్యులు దీనిపై ఆందోళన చేపట్టారు. నిందితుడితో పాటు సర్జరీ చేసిన వైద్యులపైనా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనతో బాధిత యువకుడిపై శారీరకంగా, మానసికంగా తీవ్ర ప్రభావం పడిందని, ఇందుకుగానూ అతడికి రూ.2కోట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని