వలస కూలీలపై దాడి అంటూ ఫేక్‌ వీడియోలు.. బిహార్‌ యూట్యూబర్‌ లొంగుబాటు

Fake video case: తమిళనాడులో వలస కూలీలపై దాడి అంటూ ఫేక్‌ వీడియోలు సృష్టించిన బిహార్‌కు చెందిన కశ్యప్‌ అనే నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన కశ్యప్‌ తర్వాత యూట్యూబర్‌గా మారాడు.

Published : 18 Mar 2023 23:59 IST

పట్నా: తమిళనాట బిహార్‌ వలస కూలీలపై దాడులు జరుగుతున్నాయి అంటూ ఫేక్‌ వీడియోలతో కలకలం సృష్టించిన బిహార్‌కు చెందిన యూట్యూబర్‌ ఎట్టకేలకు  కటకటాల వెనక్కి చేరాడు. ఈ ఫేక్‌ వీడియోల వెనుక కీలక సూత్రధారి అయిన బిహార్‌కు చెందిన మనీశ్‌ కశ్యప్‌... వెస్ట్‌ చంపారన్‌ జిల్లా పోలీసుల ఎదుట శనివారం లొంగిపోయాడు. అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న వేళ అరెస్ట్‌ భయంతోనే సరెండర్‌ అయ్యాడు.

తమిళనాడులో బిహార్‌ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలపై స్థానికులు దాడులు చేసి చంపుతున్నారంటూ కొన్ని నకిలీ వీడియోలు ఇటీవల కలకలం రేపాయి. అయితే, అలాంటిదేమీ లేదని పోలీసుల విచారణలో తేలింది. దీనిపై అటు తమిళనాడుతోపాటు, బిహార్ పోలీసులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా యూట్యూబర్‌ అయిన కశ్యప్‌ సహా మరికొందరిపై బిహార్‌కు చెందిన ఆర్థిక నేర విభాగం (EOU) కేసులు నమోదు చేసింది. కశ్యప్‌కు చెందిన బ్యాంకు ఖాతాలను కూడా నిలిపేసింది.

ఆరు బృందాలు శుక్రవారం నుంచి తీవ్రంగా గాలిస్తున్న క్రమంలో అరెస్ట్‌కు భయపడి కశ్యప్‌ సరెండర్‌ అయ్యాడని ఈఓయూ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే అమన్‌ కుమార్‌ను అరెస్ట్‌ చేయగా.. రాకేశ్‌ తివారీ, యువరాజ్‌ సింగ్‌ రాజ్‌పుత్‌, మనీశ్‌ కశ్యప్‌పై కేసులు నమోదు చేశారు. కూలీలపై దాడులకు సంబంధించి మొత్తం 30కి పైగా నకిలీ వీడియోలను పోలీసులు గుర్తించారు. మరోవైపు తమిళనాడులో సైతం ఈ ముఠాపై 13 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కశ్యప్‌ 2016 సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. ఆ తర్వాత యూట్యూబర్‌గా మారాడు. 2020లో ఎమ్మెల్యే ఎన్నికల్లో సైతం పోటీ చేయడం గమనార్హం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని