Yusuf Pathan: పదేళ్లుగా పట్టించుకోలేదు.. గెలిచిన వెంటనే నోటీసులు: యూసుఫ్‌ పఠాన్‌

తనపై నమోదైన ఓ కేసులో యూసుఫ్ పఠాన్‌ (Yusuf Pathan) తాజాగా గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

Updated : 21 Jun 2024 17:43 IST

గాంధీనగర్: భూఆక్రమణ కేసులో తనకు అందిన నోటీసులపై మాజీ క్రికెటర్, తృణమూల్ ఎంపీ యూసుఫ్‌ పఠాన్ (Yusuf Pathan) గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. వడోదర మున్సిపల్‌ కార్పొరేషన్‌(VMC)కు చెందిన స్థలంలోని అక్రమ కట్టడాలను 15 రోజుల్లోగా తొలగించాలంటూ ఆ సంస్థ జూన్‌ 6న  పఠాన్‌కు నోటీసులు జారీ చేసింది.

దీనిపై పఠాన్‌ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపిస్తూ.. ‘‘నేను ఇటీవల మరో పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాను. 10 సంవత్సరాలుగా ఈ విషయంలో స్పందించని సంస్థ.. ఫలితాలు వచ్చిన రెండు రోజుల తర్వాత నోటీసులు ఇచ్చింది. ఇవన్నీ నన్ను వేధించే ప్రయత్నాల్లో భాగమే. వీఎంసీ తక్షణ చర్యలు తీసుకోకుండా నిరోధించాలి. లేకపోతే బుల్డోజర్లు వస్తాయి’’ అని కోర్టుకు వెల్లడించారు.

అక్రమంగా కాంపౌండ్‌ వాల్‌ కట్టి యూసుఫ్ పఠాన్ వీఎంసీ స్థలాన్ని ఆక్రమించారని భాజపా నేత, వడోదర మాజీ కౌన్సిలర్ విజయ్ పవార్‌ ఇటీవల ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి ఈ అంశం వార్తల్లో నిలుస్తోంది. వెంటనే ఆ స్థలాన్ని వీఎంసీ వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. ఈ అంశంలో ఆయనపై కేసు పెట్టాలని వడోదర కౌన్సిలర్ నితిన్‌ డొంగా డిమాండ్ చేశారు. అలాగే అఫిడవిట్‌లో మున్సిపాలిటీకి చెందిన స్థలాన్ని తన సొంతదంటూ తప్పుగా వెల్లడించారని ఆరోపించారు. అసలు ఈ వివాదానికి 2012లో పునాది పడింది. తన ఇంటి పక్కనే కొంత స్థలాన్ని కేటాయించాలని, దానిని తాను మార్కెట్ ధరకే కొనుగోలు చేస్తానని వీఎంసీని పఠాన్‌ కోరారు. ఆ ప్రతిపాదనకు ఆ సంస్థ కూడా అంగీకరించింది. అయితే తర్వాత దానిని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఆ తర్వాత కూడా అది తన ఆధీనంలోనే ఉన్నట్లు పఠాన్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని