Mumbai Hit and Run: నాయకులైనా.. ప్రముఖులైనా ఉపేక్షించే ప్రసక్తే లేదు: ఏక్‌నాథ్‌ శిందే

శివసేన నేత రాజేశ్‌ షా కుమారుడు మిహిర్‌ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకొంది. ఈ ఘటనపై మండిపడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Published : 08 Jul 2024 20:15 IST

ముంబయి: ముంబయిలో శివసేన (Shiv Sena) నేత రాజేశ్‌ షా కుమారుడు నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ మహిళ మరణానికి కారణమైన ఘటన (Mumbai Hit and Run case) తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే, సంపన్న కుటుంబానికి చెందిన అతడు రాజకీయ ఒత్తిడితో ఈ కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) స్పందిస్తూ.. తాను ముఖ్యమంత్రి పదవిలో ఉన్నంతకాలం ఎవ్వరినీ ఉపేక్షించేది లేదన్నారు. మిహిర్‌ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఆయన.. అతడు చేసింది క్షమించరాని నేరమని అన్నారు.

రాష్ట్రంలో హిట్‌ అండ్‌ రన్‌ కేసుల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుండడంపై ముఖ్యమంత్రి శిందే ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘కొందరు ధనవంతులు, ప్రముఖులు తమ హోదాను దుర్వినియోగం చేసి నేరస్థులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది బాధాకరం. ఇలాంటివి మా ప్రభుత్వం సహించదు. హిట్‌ అండ్‌ రన్‌ కేసులో నేరస్థులకు కచ్చితంగా శిక్ష పడుతుంది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ధనవంతులైనా, రాజకీయ నాయకుల పిల్లలైనా సరే చట్టం నుంచి తప్పించుకోలేరు. నేరం చేసిన వారికి తగిన శిక్ష పడుతుంది’’ అని ఏక్‌నాథ్‌ శిందే పేర్కొన్నారు.

మహిళపై కారుతో దూసుకెళ్లి.. గర్ల్‌ఫ్రెండ్‌ ఇంట్లో నక్కి: శివసేన యువనేతపై లుక్‌ఔట్‌ నోటీసు

‘‘ప్రజల ప్రాణాలు మాకు ఎంతో విలువైనవి. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నాం. బాధితులకు న్యాయం జరిగేలా రాష్ట్ర పోలీసు శాఖను ఆదేశించా. నేరస్థులకు కఠిన శిక్ష పడడం ఖాయం. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది’’ అని హామీ ఇచ్చారు. కాగా.. ఇటీవల మిహిర్‌ మద్యం మత్తులో కారు నడుపుతూ ముందు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో వివాహిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఆమె భర్త గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే, ఈ కేసులో నిందితులకు తాజాగా బెయిల్‌ లభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని