‘కొవాగ్జిన్‌’కు ఆమోదం తెలిపిన జింబాబ్వే..!

భారత్‌లో అందుబాటులోకి వచ్చిన కొవాగ్జిన్‌ టీకా తమ దేశంలో అత్యవసర వినియోగం కింద పంపిణీ చేసేందుకు ఆఫ్రికా దేశం జింబాబ్వే ఆమోదం తెలిపింది.

Published : 04 Mar 2021 19:05 IST

హరారే: భారత్‌లో అందుబాటులోకి వచ్చిన కొవాగ్జిన్‌ టీకా తమ దేశంలో అత్యవసర వినియోగం కింద పంపిణీ చేసేందుకు ఆఫ్రికా దేశం జింబాబ్వే ఆమోదం తెలిపింది. దీంతో సాధ్యమైనంత తొందరగా కొవాగ్జిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని జింబాబ్వేలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. కొవాగ్జిన్‌ టీకా 81శాతం సమర్థత కలిగినట్లు భారత్‌ బయోటెక్‌ ప్రకటించిన మరుసటి రోజే జింబాబ్వే అనుమతించింది. దీంతో ఆఫ్రికాలో కొవాగ్జిన్‌ను ఆమోదించిన తొలి దేశంగా జింబాబ్వే నిలిచింది.

భారత్‌లో వ్యాక్సిన్‌ పంపిణీ చేయడంతో పాటు ఇతర దేశాలకు వ్యాక్సిన్‌ ఎగుమతి చేయడంలో భారత్‌ ముందున్న విషయం తెలిసిందే. ఇక్కడ తయారవుతోన్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం స్వల్ప, మధ్య ఆదాయ దేశాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఇందులో భాగంగా సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఇప్పటికే పలు దేశాలకు వ్యాక్సిన్‌ను ఎగుమతి చేస్తోంది. భారత్‌ బయోటెక్‌ కూడా 40దేశాల్లో అనుమతి కోసం దరఖాస్తులు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే బ్రెజిల్‌, యూఏఈ వంటి దేశాల్లో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ప్రకటించింది. ఇక అమెరికాలోనూ కొవాగ్జిన్‌ను పంపిణీ చేసేందుకు అక్కడి ఔషధ సంస్థ ఆక్యూజెన్‌తో భారత్‌ బయోటెక్‌ ఒప్పందం చేసుకుంది.

భారత్‌లో దాదాపు 25,800 వాలంటీర్లలో నిర్వహించిన మూడో దశ ప్రయోగాల మధ్యంతర ఫలితాలను భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది. భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ ప్రయోగాల్లో వ్యాక్సిన్‌ 81శాతం ప్రభావశీలత కనబరచినట్లు పేర్కొంది. అంతేకాకుండా బ్రిటన్‌ రకం కరోనా వైరస్‌ మీద కొవాగ్జిన్‌ టీకా బాగా పనిచేస్తున్నట్లు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ అధ్యయనంలో వెల్లడైంది. వ్యాక్సిన్‌ సమర్థత ఆశించిన మేర ఉండడంతో మరికొన్ని రోజుల్లోనే చాలా దేశాలు కొవాగ్జిన్‌ అనుమతికి ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని