Zydus Cadila: టీకా వినియోగ దరఖాస్తుకు సిద్ధం..?

దేశీయ కంపెనీ జైడస్‌ క్యాడిలా తయారుచేసిన కరోనా వ్యాక్సిన్‌ వినియోగానికి డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) నుంచి అత్యవసర అనుమతి కోరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Published : 18 Jun 2021 22:18 IST

దిల్లీ: దేశంలో ఇప్పటికే మూడు కరోనా వ్యాక్సిన్లు వినియోగంలో ఉండగా.. తాజాగా మరో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. దేశీయ కంపెనీ జైడస్‌ క్యాడిలా తయారుచేసిన కరోనా వ్యాక్సిన్‌ వినియోగానికి డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి అత్యవసర అనుమతి కోరేందుకు సిద్ధమైంది. ఇందుకోసం మరో వారం, పదిరోజుల్లోనే అనుమతి కోరుతూ డీసీజీఐకి దరఖాస్తు చేసుకోనున్నట్లు సమాచారం. ఒకవేళ అనుమతి లభిస్తే ప్రపంచంలో తొలి డీఎన్‌ఏ కరోనా వ్యాక్సిన్‌ ఇదే అవుతుంది.

గుజరాత్‌ కేంద్రంగా ఉన్న జైడస్‌ క్యాడిలా కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు డీఎన్‌ఏ సాంకేతికతతో జైకొవ్‌-డీ వ్యాక్సిన్‌ను రూపొందించింది. తుది దశ ప్రయోగాలు దాదాపు 28 వేల మందిపై జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇవి చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. తాజాగా ప్రయోగ మధ్యంతర ఫలితాలతో డీసీజీఐ అనుమతి కోరేందుకు జైడస్‌ క్యాడిలా సిద్ధమైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అనుమతి లభిస్తే రానున్న మూడు నెలల్లోనే దాదాపు 5 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను అందుబాటులోకి తెచ్చేందుకు జైడస్‌ క్యాడిలా ప్రయత్నాలు చేస్తోంది.

భారత్‌లో ఇప్పటికే మూడు టీకాలు అందుబాటులోకి రాగా మరో రెండు టీకాలు తుది దశ ప్రయోగాల్లో ఉన్నాయని కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చీఫ్ ఎన్‌కే అరోరా పేర్కొన్నారు. జైడస్‌ క్యాడిలాతో పాటు పుణెకు చెందిన జెన్నోవా ఫార్మా తయారు చేసిన వ్యాక్సిన్‌ తుది దశ ప్రయోగాల్లో ఉన్నాయని చెప్పారు. సెప్టెంబర్‌ నాటికి ఇవి కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇలా మరికొన్ని రోజుల్లో కరోనా వ్యాక్సిన్‌ల కోసం ప్రపంచ దేశాలు భారత్‌పైనే ఆధారపడే పరిస్థితి వస్తుందని ఎన్‌కే అరోరా విశ్వాసం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని