కొవిడ్‌ ఔషధ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు!

కరోనా వైరస్‌‌ చికిత్స కోసం చేపడుతోన్న ఔషధ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వచ్చినట్లు భారత్‌కు చెందిన ఫార్మా సంస్థ జైడస్‌ క్యాడిలా వెల్లడించింది.

Published : 25 Jan 2021 16:28 IST

జైడస్‌ క్యాడిలా వెల్లడి

దిల్లీ: కరోనా వైరస్‌‌ చికిత్స కోసం చేపడుతోన్న ఔషధ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వచ్చినట్లు భారత్‌కు చెందిన ఫార్మా సంస్థ జైడస్‌ క్యాడిలా వెల్లడించింది. ప్రస్తుతం మెక్సికోలో జరుగుతున్న రెండో దశ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు కనిపించాయని తెలిపింది. తాజాగా ప్రయోగాల మధ్యంతర ఫలితాలను అందుకున్న జైడస్‌ క్యాడిలా, రెండో దశ(బీ) ఫలితాలు మరింత మెరుగ్గా ఉన్నట్లు ప్రకటించింది.

కొవిడ్‌ తీవ్రత అధికంగా ఉన్న రోగుల్లో అవయవాలు వైఫల్యం చెందడానికి కారణమయ్యే హైపోక్సియా లక్షణాలు ఉన్నవారిలో ఈ ఔషధం వల్ల ఎర్రరక్తకణాల ఉత్పత్తి పెరగడంతో పాటు కణాలకు ఆక్సిజన్‌ సరఫరా మెరుగైనట్లు గుర్తించామని జైడస్‌ క్యాడిలా ప్రకటించింది. అంతేకాకుండా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఈ ఔషధం వల్ల వెంటిలేటర్‌ అవసరం రాలేదని.. కేవలం 25శాతం రోగులకు మాత్రమే వెంటిలేటర్‌ యంత్రాలపై అత్యవసర చికిత్స చేయాల్సి వచ్చిందన్నారు. కొవిడ్ రోగుల్లో కనిపించే తీవ్ర శ్వాసకోస సమస్య (ARDS)ను నివారించడంలో ఈ ఔషధం సానుకూల ఫలితాలు ఇస్తుందనే సమాచారాన్ని వెల్లడించడం ఎంతో సంతోషంగా ఉందని జైడస్‌ క్యాడిలా గ్రూప్‌ ఛైర్మన్‌ పంకజ్‌ ఆర్‌ పటేల్‌ అభిప్రాయపడ్డారు. కరోనా రోగుల్లో ఎక్కువ శాతం మరణాలు సంభవించడానికి కారణమయ్యే ARDS నుంచి బయటపడే చికిత్సను అభివృద్ధి చేయడానికి తమ సంస్థ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

కరోనా వైరస్‌ను నివారించే వ్యాక్సిన్‌ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తోన్న సమయంలోనే, కొవిడ్‌ చికిత్స కోసం ముమ్మర కృషి జరుగుతోంది. ఇందులో భాగంగా భారత్‌కు చెందిన జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేస్తోన్న ఔషధాల్లో ఒకటైన డెసిడస్టాట్‌ ప్రయోగాలను మెక్సికోలో నిర్వహిస్తున్నారు. ఇందుకోసం మెక్సికో నియంత్రణ సంస్థ గత సంవత్సరం జూన్‌లో అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి కొవిడ్‌ రోగులపై వీటిపై ప్రయోగాలు కొనసాగుతుండగా, తాజాగా ఇవి సానుకూల ఫలితాలు వెల్లడయ్యాయి. తాజా ప్రకటనతో మార్కెట్‌లో జైడస్‌ క్యాడిలా షేరు విలువ 0.59శాతం పెరిగింది.

ఇవీ చదవండి..
భారత్‌ బయోటెక్‌ నుంచి మరో టీకా!
కీళ్లవాతం ఔషధంతో కొవిడ్‌ నుంచి త్వరగా విముక్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని