కొవిడ్‌ ఔషధం: అనుమతి కోరిన జైడస్‌ క్యాడిలా!

కరోనా రోగుల్లో జరిపిన మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో కేవలం సింగిల్‌ డోసులతో ఈ ఔషధం మెరుగైన ఫలితాలు ఇచ్చినట్లు జైడస్‌ క్యాడిలా ల్లడించింది.

Published : 05 Apr 2021 15:50 IST

తుదిదశ ప్రయోగాల్లో మెరుగైన ఫలితాలు

దిల్లీ: దేశవ్యాప్తంగా ఇప్పటికే కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగా, కరోనా చికిత్సలో భాగంగా ఔషధం కోసం పరిశోధనలు ముమ్మరంగా జరుగుతున్నాయి. భారత్‌కు చెందిన జైడస్‌ క్యాడిలా వీటిపై ఇప్పటికే క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించింది. మూడో దశ క్లినికల్‌ ప్రయోగాల్లో కేవలం సింగిల్‌ డోసులతోనే మెరుగైన ఫలితాలు వచ్చినట్లు ఈ సంస్థ వెల్లడించింది. దీంతో కొవిడ్‌ చికిత్సలో ఈ ఔషధ వినియోగానికి అనుమతి ఇవ్వాలని భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)ని సంప్రదించినట్లు జైడస్‌ క్యాడిలా ప్రకటించింది.

కరోనా రోగులకు చికిత్స కోసం ‘పెగిలేటెడ్‌ ఇంటర్‌ఫెరాన్‌ ఆల్ఫా 2బీ’ ఔషధంపై జైడస్‌ క్యాడిలా ఫార్మా సంస్థ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించింది. ఇందుకోసం దాదాపు 250 కరోనా రోగులపై మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టింది. ఈ ఔషధం తీసుకున్న ఏడు రోజుల్లో 91.15శాతం రోగుల్లో కరోనా నెగటివ్‌ (ఆర్టీపీసీఆర్‌) వచ్చినట్లు ప్రయోగాల్లో గుర్తించింది. అంతేకాకుండా రోగులకు ఆక్సిజన్‌ అవసరమయ్యే సమయాన్ని 80గంటల నుంచి 56గంటలకు తగ్గించినట్లు తేలింది. కొవిడ్‌ రోగులకు ఒక్క డోసు ఇవ్వడం ద్వారా వారిలో మెరుగైన ఫలితాలు వస్తున్నట్లు కనుగొంది. ఈ PegIFN ఔషధాన్ని కరోనా రోగులకు ఇవ్వడం ద్వారా వైరస్‌ నుంచి త్వరగా కోలుకోవడంతో పాటు తీవ్ర సమస్యల నుంచి బయటపడవచ్చని జైడస్‌ క్యాడిలా వెల్లడించింది. కరోనా వైరస్‌ నియంత్రణలో ఈ ఔషధం ఎంతగానో దోహదపడుతుందని.. ఈ సమయంలో కరోనా రోగులకు, వైద్యారోగ్య సిబ్బందికి మద్దతు తెలపడానికి కట్డుబడి ఉన్నామని జైడస్ క్యాడిలా ఎండీ డాక్టర్‌ శార్విల్‌ పటేల్‌ వెల్లడించారు.

హెపటైటిస్‌ బీ, సీ, రోగుల్లో చికిత్స కోసం ‘పెగిలేటెడ్‌ ఇంటర్‌ఫెరాన్‌ ఆల్ఫా 2బీ’ ఔషధాన్ని ఇప్పటికే వినియోగిస్తున్నారు. తొలుత హైపటైటిస్‌-సీ చికిత్స కోసం ఈ ఔషధం ఆమోదం పొందగా, 2011లో భారత మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ ఔషధంపై అమెరికాలో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు అక్కడి నియంత్రణ సంస్థ(యూఎస్‌ఎఫ్‌డీఏ)తో సంప్రదింపులు జరుపుతున్నామని జైడస్‌ క్యాడిలా వెల్లడించింది. ఇదిలాఉంటే, జైకోవ్-డీ పేరుతో జైడస్‌ క్యాడిలా కొవిడ్‌ వ్యాక్సిన్‌ను కూడా తీసుకురానుంది. ఇందుకోసం దాదాపు 30వేల మందిపై ఇప్పటికే మూడో దశ ప్రయోగాలను కూడా జరిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని